దక్కన్ చార్జర్స్ స్థానంలో 2013లో వచ్చిన మరో హైదరాబాద్ జట్టు సన్‌రైజర్స్ తొలి మూడు సీజన్లు తమదైన ముద్ర వేయలేకపోయింది. అయితే కెప్టెన్‌గా ముందుండి నడిపించిన డేవిడ్ వార్నర్ (848 పరుగులు) 2016లో తమ టీమ్‌కు తొలిసారి టైటిల్ అందించాడు. స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లపై నిషేధం పడటంతో ఈ ఏడాది వాటి స్థానాల్లో కొత్తగా రైజింగ్ పుణే సూపర్ జెయింట్, గుజరాత్ లయన్స్ టీమ్‌లు బరిలోకి దిగాయి. తొలిసారి టోర్నీలో ఆడిన గుజరాత్ 9 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఎల్‌ఈడీ స్టంప్స్‌ను మొదటిసారి ఈ ఐపీఎల్‌లో ఆడటం కొత్త ఆకర్షణ కాగా... మహారాష్ట్రలో నీటి కొరత కారణంగా ముంబై, పుణే జట్ల లీగ్ మ్యాచ్‌లు విశాఖపట్నానికి తరలిపోవడం మరో కీలక మార్పు. 2017 వరకు టైటిల్ స్పాన్సర్‌గా ఒప్పందం ఉన్నా వివాదాల కారణంగా పెప్సీ రెండేళ్ల ముందే తప్పుకుంది. ఫలితంగా 2016 నుంచి ‘వివో’ లీగ్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.
ఆసక్తికర ఫైనల్లో...
బెంగళూరులో జరిగిన తుది పోరులో సన్‌రైజర్స్ 8 పరుగుల స్వల్ప తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌ను ఓడించింది. ముందుగా హైదరాబాద్ జట్టు వార్నర్ (69), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బెన్ కటింగ్ (39 నాటౌట్, 2/35) మెరుపులతో ఏడు వికెట్లకు 208 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బెంగళూరు ఏడు వికెట్లకు 200 పరుగులకే పరిమితమైంది. గేల్ (76), కోహ్లి (54) తొలి వికెట్‌కు 63 బంతుల్లోనే 114 పరుగులు జోడించి విజయానికి బాటలు వేసినా... 140 పరుగుల వద్ద కోహ్లి ఔటయ్యాక జట్టు కుప్పకూలింది.
కోహ్లి శతకాల మోత...
లీగ్‌లో మొత్తం ఆరు సెంచరీలు నమోదైతే ఇందులో విరాట్ కోహ్లి ఒక్కడే నాలుగు చేయడం విశేషం. అతను 113, 109, 108 నాటౌట్, 100 నాటౌట్ పరుగులు చేయగా... డివిలియర్స్, క్వింటన్ డి కాక్ ఒక్కో సెంచరీ సాధించారు. కోహ్లి ఏకంగా 38 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. కోహ్లి, డివిలియర్స్ ఒకే మ్యాచ్‌లో గుజరాత్‌పై సెంచరీలతో విరుచుకుపడటంతో పలు రికార్డులు బద్దలయ్యాయి.
ప్లేయర్ ఆఫ్ ద సిరీస్: విరాట్ కోహ్లి (బెంగళూరు–973 పరుగులు)
అత్యధిక పరుగులు (ఆరెంజ్ క్యాప్): విరాట్ కోహ్లి (బెంగళూరు–973 పరుగులు)
అత్యధిక వికెట్లు (పర్పుల్ క్యాప్): భువనేశ్వర్ (సన్‌రైజర్స్–23 వికెట్లు)
Comments
Please login to add a commentAdd a comment