ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి మరో 11 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మార్చి 22న ఈ సీజన్ తొలి మ్యాచ్ జరుగనుంది. ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
సీజన్ ప్రారంభానికి ముందు ఐపీఎల్ టాప్ రికార్డు అయిన ఆరెంజ్ క్యాప్‌పై (అత్యధిక పరుగులు) ఓ లుక్కేద్దాం. ఐపీఎల్ తొలి ఎడిషన్ (2008) నుంచే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది.
ఐపీఎల్ తొలి ఆరెంజ్ క్యాప్‌ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఆటగాడు షాన్ మార్ష్ సొంతం చేసుకున్నాడు. ఆ సీజన్‌లో మార్ష్ 11 మ్యాచ్‌ల్లో సెంచరీ, 5 హాఫ్ సెంచరీల సాయంతో 616 పరుగులు చేసి సీజన్ టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం 2009 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మాథ్యూ హేడెన్ ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. ఆ సీజన్‌లో హేడెన్ 12 మ్యాచ్‌ల్లో 5 అర్దసెంచరీల సాయంతో 572 పరుగులు చేశాడు.
2010 ఎడిషన్ విషయానికొస్తే.. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ 15 మ్యాచ్‌ల్లో 618 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
అనంతరం 2011, 2012 సీజన్లలో ఆర్సీబీ ఆటగాడు క్రిస్ గేల్ వరుసగా రెండు సార్లు (608, 733) ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకోగా.. 2013లో సీఎస్‌కే ఆటగాడు మైక్ హస్సీ (733), 2014లో కేకేఆర్ రాబిన్ ఉతప్ప (660), 2015లో సన్‌రైజర్స్ డేవిడ్ వార్నర్ (562) ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు.
2016లో ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి (973) లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు (ఒక సీజన్‌లో) చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకోగా.. 2017లో సన్‌రైజర్స్ వార్నర్ (692), 2018లో సన్‌రైజర్స్ కేన్ విలియమ్సన్ (735), 2019లో వార్నర్ (692) ముచ్చటగా మూడో సారి, 2020లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కేఎల్ రాహుల్ (670), 2021లో సీఎస్‌కే రుతురాజ్ గైక్వాడ్ (635), 2022లో రాజస్థాన్ రాయల్స్ జోస్ బట్లర్ (863), 2023లో గుజరాత్ టైటాన్స్ శుభ్‌మన్ గిల్ (890) ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నారు. మరి ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ఎవరు గెలుచుకుంటారో కామెంట్‌లో తెలియజేయండి.
Comments
Please login to add a commentAdd a comment