Rishab Pant: టీమిండియా యువ వికెట్‌కీపర్, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కొద్ది రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై, ప్రస్తుతం ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. పంత్ గాయంపై తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ విషయంపై బీసీసీఐకి చెందిన ఓ కీలక అధికారి మాట్లాడుతూ.. పంత్ మరో 9 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉంటాడని పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు.
ఇదే జరిగితే పంత్.. ఈ మధ్యకాలంలో జరిగే న్యూజిలాండ్ సిరీస్ (స్వదేశంలో జనవరి, ఫిబ్రవరిల్లో జరిగే 3 వన్డేలు, 3 టీ20లు), ఆస్ట్రేలియా సిరీస్ (స్వదేశంలో ఫిబ్రవరి, మార్చిల్లో జరిగే 4 టెస్ట్‌లు, 3 వన్డేలు), ఐపీఎల్ (మార్చి నుంచి మే వరకు), జూన్‌లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ (భారత్ క్వాలిఫై అయితే), జులై, ఆగస్ట్‌ల్లో జరిగే వెస్టిండీస్ టూర్ (2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20లు), సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్, స్వదేశంలో అక్టోబర్‌లో ఆసీస్‌తో వన్డే సిరీస్ (3 వన్డేలు), అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే వన్డే ప్రపంచకప్‌లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.
కాగా, అంతర్జాతీయ స్థాయిలో పంత్‌కు (టీమిండియాకు) ప్రత్యామ్నాయాలు చాలానే ఉన్నప్పటికీ, ఐపీఎల్‌లో అతని స్థానాన్ని భర్తీ చేయడం మాత్రం చాలా కష్టంగా కనిపిస్తుంది. పంత్ యాక్సిడెంట్ విషయం తెలిసి ఒక్కసారిగా ఉలిక్కిపడిన డీసీ యాజమాన్యం.. తమ కెప్టెన్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలని ప్రస్తుతం తలలు పట్టుకుంది.
విదేశీ ఆటగాడిని కెప్టెన్ చేస్తే, ఓ ఫారిన్ ప్లేయర్‌ను బరిలోకి దించే అవకాశం కోల్పోతామన్నది ఓ సమస్య అయితే, స్వదేశీ ఆటగాళ్లలో అంత అనుభవజ్ఞుడైన నాయకుడు లేకపోవడం మరో సమస్య.
ఈ నేపథ్యంలో తాజాగా వెలువడుతున్న సంకేతాల ప్రకారం డీసీ యాజమాన్యం విదేశీ ఆటగాడివైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అనుభవజ్ఞుడు, ఓ సారి ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ (ఎస్‌ఆర్‌హెచ్) అయిన డేవిడ్ వార్నర్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పాలని డిసైడైనట్లు సమాచారం.
ఒకవేళ డీసీ యాజమాన్యం తమ ప్లాన్ మార్చుకున్నట్లైతే మనీశ్ పాండేను ఆ అదృష్టం వరిస్తుందని డీసీ వర్గాలు చెబుతున్నాయి. రేసులో మిచెల్ మార్ష్, పృథ్వీ షా పేర్లు వినిపించినప్పటికీ.. వార్నర్ లేదా మనీశ్ పాండేల్లో ఎవరో ఒకరు డీసీ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక జట్టులో పంత్ స్థానం విషయానికొస్తే.. వికెట్‌కీపింగ్ బాధ్యతలతో పాటు మిడిలార్డర్‌లో ధాటిగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న సర్ఫరాజ్ ఖాన్‌కు తుది జట్టు స్థానం పక్కా అని సమాచారం.
ఐపీఎల్ 2023 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్..
రిషబ్ పంత్, ఖలీల్ అహ్మద్, అమాన్ హకీం ఖాన్, యశ్ ధుల్, ప్రవీణ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ముకేశ్ కుమార్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కమలేశ్ నాగర్‌కోటి, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, విక్కీ ఓస్వాల్, మనీశ్ పాండే, రిపల్ పటేల్, అక్షర్ పటేల్, రోవమన్ పావెల్, రిలీ రొస్సో, చేతన్ సకారియా, ఫిలిప్ సాల్ట్, ఇషాంత్ శర్మ, పృథ్వీ షా, డేవిడ్ వార్నర్
Comments
Please login to add a commentAdd a comment