మొయినుద్దౌలా గోల్డ్‌కప్ క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ దీటుగా జవాబిస్తోంది. 4 పరుగుల తేడాతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయినా... ముగ్గురు బ్యాట్స్‌మెన్ అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: మొయినుద్దౌలా గోల్డ్‌కప్ క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ దీటుగా జవాబిస్తోంది. 4 పరుగుల తేడాతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయినా... ముగ్గురు బ్యాట్స్‌మెన్ అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. ఫలితంగా ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఢిల్లీతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో... రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో నిర్ణీత 90 ఓవర్లలో 8 వికెట్లకు 383 పరుగులు చేసింది.
అమోల్ షిండే (100 బంతుల్లో 67; 10 ఫోర్లు), అక్షత్ రెడ్డి (95 బంతుల్లో 52; 8 ఫోర్లు), ఆశిష్ రెడ్డి (59 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్సర్) నిలకడగా ఆడి జట్టుకు స్కోరు అందించారు. సుమన్ (41), రాహుల్ సింగ్ (49), హబీబ్ అహ్మద్ (48 నాటౌట్)లు ఫర్వాలేదనిపించారు. పర్వీందర్ అవానా, సుమిత్ నర్వాల్ చెరో రెండేసి వికెట్లు తీశారు. ఆదివారం రెండు జట్ల మధ్య 40 ఓవర్ల ఇన్నింగ్స్ జరుగుతాయి.
తమిళనాడుకు ఆధిక్యం
ఈసీఐఎల్ మైదానంలో కర్ణాటకతో జరుగుతున్న మరో మ్యాచ్‌లో తమిళనాడుకు 5 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 89.4 ఓవర్లలో 392 పరుగులకు ఆలౌటైంది. బాబా అపరాజిత్ (175 బంతుల్లో 122; 12 ఫోర్లు), సురేశ్ కుమార్ (151 బంతుల్లో 105; 11 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గంగ శ్రీధర్ రాజు (32), సుశీల్ (56), రోహిత్ (40 నాటౌట్)లు రాణించారు. అరవింద్ 72 పరుగులకు 7 వికెట్లు తీశాడు.