రైజర్స్‌ ఆఖరి బంతికి... | Hyderabads second consecutive win | Sakshi
Sakshi News home page

రైజర్స్‌ ఆఖరి బంతికి...

Published Fri, Apr 13 2018 1:11 AM | Last Updated on Fri, Apr 13 2018 7:38 AM

Hyderabads second consecutive win - Sakshi

పరుగులు కావాలి... చేతిలో వికెట్‌ మాత్రమే ఉంది. బెన్‌ కటింగ్‌ వేసిన ఓవర్‌ తొలి బంతికే హుడా సిక్సర్‌ బాది సులువుగా ముగించేలా కనిపించినా... తర్వాతి నాలుగు బంతుల్లో నాలుగు పరుగులే వచ్చాయి. స్కోర్లు సమమైన దశలో ఆఖరి బంతిని స్టాన్‌లేక్‌ ఫోర్‌ కొట్టడంతో హైదరాబాద్‌ ఊపిరి పీల్చుకుంది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను పీకల మీదకు తెచ్చుకొని చివరకు గట్టెక్కింది.

సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒక దశలో సన్‌రైజర్స్‌ స్కోరు 62/0... అయితే కొత్త లెగ్‌స్పిన్‌ సంచలనం మయాంక్‌ మార్కండే అద్భుత బౌలింగ్‌తో సీన్‌ మారిపోయింది. ఫలితంగా తర్వాతి 38 బంతుల్లో వచ్చింది 39 పరుగులే... కోల్పోయింది 5 వికెట్లు. ఈ స్థితిలో సన్‌రైజర్స్‌ తీవ్ర ఒత్తిడికి లోనై మరో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఎట్టకేలకు అతి కష్టమ్మీద హైదరాబాద్‌ విజయతీరం చేరింది. అంతకుముందు రషీద్‌ సహా ఇతర సన్‌ బౌలర్ల దెబ్బకు ముంబై బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేసి వరుసగా రెండో  ఓటమికి బాటలు వేశారు. 

సాక్షి, హైదరాబాద్‌: సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం ఉప్పల్‌ స్టేడియంలో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రైజర్స్‌ వికెట్‌ తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్‌  ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఎవిన్‌ లూయీస్‌ (17 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పొలార్డ్‌ (23 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (31 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్‌) జట్టు స్కోరులో తలో చేయి వేశారు. సందీప్, కౌల్, స్టాన్‌లేక్‌ తలా 2 వికెట్లు పడగొట్టగా... ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రషీద్‌ ఖాన్‌ 4 ఓవర్లలో 13 పరుగులు మాత్ర మే ఇచ్చి ఒక వికెట్‌ తీయడం విశేషం. అనం è రం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ధావన్‌ (28 బంతుల్లో 45; 8 ఫోర్లు) మరోసారి టాప్‌ స్కోరర్‌గా నిలవగా... దీపక్‌ హుడా (25 బంతుల్లో 32 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. మయాంక్‌ మార్కండే 23 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. శనివారం కోల్‌కతాలో జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ తలపడుతుంది.  

రషీద్‌ సూపర్‌... 
స్టార్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ లేకపోయినా సన్‌రైజర్స్‌ బౌలింగ్‌లో పదును తగ్గలేదు. ఆరంభ ఓవర్లలోనే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి పరుగులు ఇవ్వకుండా నిరోధించడంలో వారు సఫలమయ్యారు. ఫలితంగా పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై 54 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. సున్నా వద్ద హుడా క్యాచ్‌ వదిలేసిన తర్వాత ఒక సిక్స్, ఫోర్‌ కొట్టి రోహిత్‌ శర్మ (11) అవుటవ్వగా... లూయీస్‌ మాత్రం ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. సందీప్‌ బౌలింగ్‌లో సిక్సర్‌తో ఐపీఎల్‌లో ఖాతా తెరిచిన అతను స్టాన్‌లేక్‌ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో చెలరేగాడు. అయితే ఒకే ఓవర్లో ఇషాన్, లూయిస్‌లను అవుట్‌ చేసి కౌల్‌ ముంబైని దెబ్బకొట్టాడు. పొలార్డ్, సూర్య కుమార్‌ ఐదో వికెట్‌కు 38 పరుగులు జోడిం చినా అందుకు 36 బంతులు తీసుకున్నారు. స్టాన్‌లేక్‌ ఓవర్లో సిక్స్, ఫోర్‌ కొట్టి అదే ఓవర్లో పొలార్డ్‌ వికెట్‌ చేజార్చుకోగా, సూర్యకుమార్‌ ఆటను సందీప్‌ ముగించాడు. చివరి ఐదు ఓవర్లలో ముంబై 36 పరుగులే చేసింది. జట్టు ఇన్నింగ్స్‌లో ఏకంగా 62 డాట్‌ బాల్స్‌ ఉండగా... రషీద్‌ ఒక్కడే 18 డాట్‌ బాల్స్‌ వేయడం విశేషం.  

ధనాధన్‌గా... 
స్వల్ప లక్ష్య ఛేదనను సన్‌రైజర్స్‌ జోరుగా ప్రారంభించింది. ధావన్‌ దూకుడు ప్రదర్శించగా... గత మ్యాచ్‌ లో విఫలమైన సాహా (20 బంతుల్లో 22; 3 ఫోర్లు) ఈసారి కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 56 పరుగులకు చేరింది. అయి తే మార్కండే చక్కటి గుగ్లీతో సాహాను బోల్తా కొట్టిం చడంతో సన్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం ముస్తఫిజుర్‌ తన తొలి ఓవర్లోనే విలియమ్సన్‌ (6)ను వెనక్కి పంపాడు. ఆ వెంటనే ధావన్‌ను కూడా అవుట్‌ చేసి మర్కండే ముంబై జట్టులో ఆశలు రేపాడు. తన తర్వాతి ఓవర్లో మనీశ్‌ పాండే (11)ను కూడా అతను అవుట్‌ చేయడంతో రైజర్స్‌ కష్టాల్లో పడింది. మర్కండే తన ఆఖరి ఓవర్లో షకీబ్‌ (12)ను బౌల్డ్‌ చేసి హైదరాబాద్‌ను దెబ్బ తీశాడు. ఆ తర్వాత హుడా, యూసుఫ్‌ పఠాన్‌ (14) భాగస్వామ్యం చివరకు జట్టును గెలుపునకు చేరువ చేసినా గెలుపు కోసం కొన్ని ఉత్కంఠ క్షణాలను అధిగమించక తప్పలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement