సాక్షి క్రీడా విభాగం : జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా వెలుగులోకి వచ్చి తదనంతరం భారత జట్టుకు ఎంపికైన ఆటగాళ్లలో కొందరు. మరికాస్త వెనక్కి వెళ్తే మనీశ్ పాండే, మోహిత్ శర్మ, సంజు శామ్సన్ తదితరులతో ఈ జాబితా ఇంకా పెద్దదే. రంజీ ట్రోఫీ సహా దేశవాళీ క్రికెట్‌లో ప్రదర్శనే భారత జట్టులో చోటుకు ప్రామాణికమని సెలెక్టర్లు చెబుతున్నా... ఐపీఎల్ ‘ఇన్‌స్టంట్’ గుర్తింపు తెస్తుందనడంలో సందేహం లేదు. ఇందుకు తగ్గట్లే లీగ్ ద్వారా ఎంతోమంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. తాజా సీజన్‌లోనూ కొందరు కుర్రాళ్లు అవకాశం దక్కితే ఆకట్టుకోగలరని భావించినా... కృష్ణప్ప గౌతమ్, శుబ్‌మన్ గిల్ మినహా మిగతా వారంతా అవకాశం కోసం చూస్తునే ఉన్నారు. మరి వారెవరో చూద్దాం...
ఖలీల్ అహ్మద్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)
2016లో భారత అండర్–19 జట్టు సభ్యుడిగా ప్రదర్శన చూసి రాజస్తాన్‌కు చెందిన ఈ పేస్ బౌలర్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులోకి తీసుకుంది. కానీ, రెండు సీజన్లలోనూ మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. అద్భుత ప్రతిభావంతుడిగా రాహుల్ దవ్రిడ్ నుంచి ప్రశంసలు అందుకున్న ఖలీల్‌కు ఈ సారీ ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రస్తుత సన్‌రైజర్స్ లైనప్ ప్రకారం ఎడమ చేతివాటం ఖలీల్ తుది జట్టులో ఉంటాడని అంతా భావించారు. గాయంతో ప్రధాన పేసర్ భువనేశ్వర్ దూరమైనా... సిద్ధార్థ్ కౌల్, సందీప్‌శర్మ, బాసిల్ థంపి వంటి బౌలర్లపైనే జట్టు నమ్మకం ఉంచడంతో ఖలీల్ అరంగేట్రానికి మరికొంత కాలం వేచి ఉండాల్సి రావొచ్చు.
రికార్డు: 11 టి20 మ్యాచ్‌ల్లో 17.41 సగటు, 6.88 ఎకానమీతో 17 వికెట్లు
నవ్‌దీప్ సైని (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)
దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉన్న నవదీప్ సైనికి ఇది మొదటి ఐపీఎల్ కాదు. గతంలో డేర్‌డెవిల్స్ తరఫున ఆడాడు. ఆ సమయంలో పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆట తీరు ఎంతో మెరుగుపర్చుకున్న తర్వాత కోహ్లి దృష్టిలో పడిన ఈ ఢిల్లీ కుర్రాడిని అతడి నాయకత్వంలోని బెంగళూరు ఫ్రాంచైజీ దక్కించుకుంది. టీమిండియా ప్రాక్టీస్ సెషన్ బౌలర్లలో క్రమం తప్పకుండా ఉండే సైని పేరు ఒక దశలో జట్టు ఎంపికలోనూ వినిపించింది. కానీ, అనూహ్యంగా ఆర్‌సీబీ అతడిని ఇంతవరకు ఆడించనే లేదు. బెంగళూరు బౌలింగ్ పరిమితుల రీత్యా చూసినా సైనిని పరీక్షించి చూడొచ్చు. అయితే... హైదరాబాదీ సిరాజ్‌పై కోహ్లి నమ్మకం ఉంచడం, అతడు కుదురుకుంటుండటంతో మరో ఆలోచన చేస్తున్నట్లు లేదు.
రికార్డు: 14 టి20 మ్యాచ్‌లలో 25.30 సగటు, 6.03 ఎకానమీతో 13 వికెట్లు
మన్‌జోత్ కల్రా (ఢిల్లీ డేర్ డెవిల్స్)
ఇటీవలి అండర్–19 ప్రపంచకప్ విజయంతో కల్రా పేరు వెలుగులోకి వచ్చింది. ఫైనల్లో ఆస్ట్రేలియాపై సెంచరీ అతడిని ప్రత్యేకంగా నిలిపింది. ఎడమ చేతివాటం ఓపెనర్ కావడం, జాతీయ జట్టుకు ఇలాంటి శైలి ఆటగాడు అవసరం ఉండటంతో తనపై అంచనాలు పెరిగాయి. ఢిల్లీకే చెందిన ఈ కుర్రాడిపై ఎంపిక సమయంలో నాటి కెప్టెన్ గంభీర్ అపార నమ్మకం ఉంచాడు. దేశవాళీ ఆటగాడిగా తుది జట్టులో ఉంటాడని కూడా అనుకున్నారు. కానీ, ఢిల్లీ జట్టులో తన పేరే కనిపించడం లేదు. వైఫల్యాలతో సతమతం అవుతున్న ఢిల్లీ... కల్రా కంటే మరో యువ సంచలనం పృథ్వీ షాకే అవకాశం ఇచ్చింది. దీంతో కల్రా బెంచ్‌కే పరిమితం అవుతున్నాడు.
సందీప్ లమ్చానే (ఢిల్లీ డేర్‌డెవిల్స్)
లెగ్ స్పిన్ నైపుణ్యంతో ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్‌ను అమితంగా ఆకట్టుకున్నాడు లమ్చానే. అతడి సిఫార్సుతోనే ఢిల్లీ మెంటార్ పాంటింగ్... లమ్చానేను జట్టులోకి తీసుకున్నాడు. దీంతో ఐపీఎల్ ఆడనున్న తొలి నేపాలీగా రికార్డుల్లోకి ఎక్కుతాడని అనుకున్నారు. అయితే, జట్టులో అమిత్ మిశ్రా, తేవటియా రూపంలో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు ఉండటంతో సందీప్‌కు చోటివ్వడం కష్టమవుతోంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వైవిధ్యం కోసం ప్రయత్నిస్తే... లమ్చానే అరంగేట్రం ఎంతో దూరంలో ఉండకపోవచ్చు.
మంజూర్ దార్ (పంజాబ్ కింగ్స్ ఎలెవెన్)
భారీ హిట్టర్, టి20 స్ట్రైక్ రేట్ 140, కష్టాలకోర్చి ఎదిగిన నేపథ్యం... ఇలాంటి ప్రత్యేకతలు కలిగిన కశ్మీరీ మంజూర్ దార్‌ను పంజాబ్ ఎప్పుడు బరిలోకి దింపినా అది ఆసక్తికర అంశమే. మంజూర్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. దీంతో కరుణ్‌నాయర్, యువరాజ్ సింగ్, మనోజ్ తివారిలలో ఏ ఇద్దరినైనా పక్కకుపెడితే తప్ప... జట్టు ఇప్పుడున్న విజయాల ఊపులో అతడికి చోటు ఆశించడం కష్టమే. రసూల్ తర్వాత ఐపీఎల్ ఆడిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందాలని భావిస్తున్న మంజూర్ తన అవకాశం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment