సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ గర్జించింది. ఉప్పల్ మైదానంలో నాలుగో విజయంతో, ఓవరాల్‌గా ఏడో గెలుపుతో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. శనివారం జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై గెలుపొందింది. మొదట బౌలింగ్, ఫీల్డింగ్‌తో ప్రత్యర్థి జోరును కట్టడి చేసిన సన్‌రైజర్స్... ఓపెనర్లు హేల్స్ (31 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ధావన్ (30 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్)ల శుభారంభంతో విజ యం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. పృథ్వీ షా (36 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశాడు. తర్వాత హైదరాబాద్ 19.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి గెలిచింది. చివర్లో పఠాన్ (12 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక పాత్ర పోషించాడు. మిశ్రాకు 2 వికెట్లు దక్కాయి.
మెరిసిన పృథ్వీషా
అద్భుత బౌలింగ్ దళమున్న సన్‌రైజర్స్‌తో ఛేదన కష్టమనుకున్న డేర్‌డెవిల్స్ కెప్టెన్ అయ్యర్ టాస్ నెగ్గిన వెంటనే మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్‌కే మొగ్గుచూపాడు. మ్యాక్స్‌వెల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన యువ బ్యాట్స్‌మన్ పృథ్వీషా ధాటైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కానీ రెండో ఓవర్లోనే దురదృష్టంకొద్దీ మ్యాక్స్‌వెల్ (2) రనౌటయ్యాడు. సందీప్ శర్మ వేసిన ఈ ఓవర్ మూడో బంతికి పృథ్వీ లాంగాన్‌లో సిక్సర్ బాదాడు. అదే ఊపుతో స్ట్రయిట్ డ్రైవ్‌కు ప్రయత్నించగా... బౌలర్ సందీప్ చేతిని తాకుతూ వెళ్లిన బంతి నేరుగా వికెట్లను తగిలింది. దీంతో నాన్ స్ట్రయిక్ ఎండ్‌లో గీతదాటిన మ్యాక్స్‌వెల్ నిరాశగా రనౌటై వెనుదిరిగాడు. తర్వాత పృథ్వీకి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జతయ్యాడు. సిద్ధార్థ్ కౌల్ వేసిన తొలి ఓవర్లో పృథ్వీషా చెలరేగాడు. మూడో బంతిని సిక్స్ కొట్టిన ఢిల్లీ ఓపెనర్ తర్వాత మూడు బంతుల్ని బౌండరీలకు తరలించాడు. దీంతో ఆ ఓవర్లో ఢిల్లీకి 20 పరుగులు వచ్చాయి.
ఇన్నింగ్స్ 7వ ఓవర్లోనే పృథ్వీ 25 బంతుల్లోనే (5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫిఫ్టీ పూర్తిచేశాడు. ఇద్దరు క్రీజులో పాతుకుపోవడంతో ఢిల్లీ తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. కానీ తర్వాతి ఓవర్ తొలి బంతికే పృథ్వీషాను రషీద్‌ఖాన్ ఔట్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 86 పరుగుల‡భాగస్వామ్యానికి తెరపడింది. ఢిల్లీ జోరు కూడా మందగించింది. సిద్ధార్థ్, భువీలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల వేగం తగ్గింది. అర్ధసెంచరీ దిశగా సాగుతున్న శ్రేయస్‌ను సిద్ధార్థ్ ఔట్ చేయగా... రిషభ్ పంత్ (19 బంతుల్లో 18; 1 ఫోర్) రషీద్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్వాత వచ్చిన నమన్ ఓజా (1) రనౌటయ్యాడు. దీంతో 9 పరుగుల వ్యవధిలోనే కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. చివర్లో విజయ్ శంకర్ (13 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) బ్యాట్ ఝళిపించడంతో ఢిల్లీ 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది.
ఓపెనర్ల శుభారంభం
కష్టసాధ్యం కానీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్లు అలెక్స్ హేల్స్, శిఖర్ ధావన్ చక్కని ఆరంభాన్నిచ్చారు. ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్ మ్యాచ్‌కే హైలైట్. అవేశ్‌ఖాన్ వేసిన ఈ ఓవర్లో ధావన్ ఒక సిక్స్ కొట్టగా, హేల్స్ మూడు సిక్సర్లు బాదేశాడు. దీంతో 27 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు 34/0గా ఉన్న స్కోరు కాస్త 6 బంతుల వ్యవధిలోనే 61/0 కి చేరింది. తొలి వికెట్‌కు 76 పరుగులు జతయ్యాక తొమ్మిదో ఓవర్ చివరి బంతికి అమిత్ మిశ్రా తన గింగిర్లు తిప్పే బంతితో హేల్స్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. అలాగే ధావన్‌ను కూడా మిశ్రా తన తర్వాతి ఓవర్ (ఇన్నింగ్స్ 11వ)లోనూ చివరి బంతికే బౌల్డ్ చేశాడు. 86 పరుగులకు 2 వికెట్లు కోల్పోగా... మనీశ్ పాండే (17 బంతుల్లో 21; 2 ఫోర్లు) కెప్టెన్ విలియమ్సన్‌తో కలిసి వేగంగా పరుగులు జోడించాడు. వీళ్లిద్దరు కలిసి మూడో వికెట్‌కు 46 జోడించాక పాండేను ప్లంకెట్ ఔట్ చేశాడు. అనంతరం విలియమ్సన్ (30 బంతుల్లో 32 నాటౌట్; 1 సిక్స్)కు జతకలిసిన యూసుఫ్ పఠాన్ జట్టు విజయంలో మెరుపుపాత్ర పోషించాడు. ఖాతా తెరవకముందే యూసుఫ్ పఠాన్ ఇచ్చిన క్యాచ్‌ను విజయ్ శంకర్ జారవిడువడంతో బతికిపోయిన అతను భారీ సిక్సర్లతో జట్టును గెలిపించాడు. చివరి ఓవర్లో 14 పరుగులు అవసరం కాగా... పఠాన్ వరుస బంతుల్లో సిక్స్, ఫోర్ కొట్టడంతో విజయం ఖాయమైంది.
రైజర్స్ ‘టాప్’ గేర్
Published Sun, May 6 2018 12:52 AM | Last Updated on Sun, May 6 2018 11:58 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment