అప్పుడే ఆశలు వదులుకున్నా: యువీ
కటక్: దాదాపు మూడేళ్ల తరువాత భారత వన్డే జట్టులోకి వచ్చిన యువరాజ్.. పునరాగమనం తరువాత ఆడిన రెండో వన్డేలోనే ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ పై రెండో వన్డేలో యువరాజ్ 150 పరుగుల్ని నమోదు చేసి తన రీ ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. అయితే భారత జట్టులో స్థానం కోల్పోయినప్పుడు తిరిగి మళ్లీ ఆడతానని అనుకోలేదని యువీ పేర్కొన్నాడు. జట్టు నుంచి ఉద్వాసనకు గురైన తరువాత తాను సరైన ప్రదర్శన చేయలేకపోవడం కూడా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందన్నాడు.
అయితే క్యాన్సర్ బారి నుంచి కోలుకున్న తరువాత తిరిగి జట్టులోకి రావడానికి విపరీతంగా శ్రమించినట్లు యువీ అన్నాడు. ఇక్కడ తనకు కలిసొచ్చిన అదృష్టం ఏదైనా ఉందంటే అది తన హార్డ్వర్కేనన్నాడు.'నేను క్రికెట్ ను తిరిగి ఆడతానని అనుకోలేదు. భారత జట్టులో స్థానం కోల్పోయినప్పుడే ఆశలు వదులుకున్నా. క్యాన్సర్ ను జయించే క్రమంలో ఒత్తిడిని కూడా జయించాలనుకున్నా. ఆ క్రమంలోనే వార్తా పత్రికలు, టీవీలు చూడటం పూర్తిగా మానేశా. కేవలం క్యాన్సర్ తో పాటు ఆటపైనే ప్రధానంగా దృష్టి సారించా. ఈ మేరకు రంజీ ట్రోఫీలో సత్తా చాటుకుని నన్ను నిరూపించుకున్నా. అదే నా పునరాగమనానికి కారణమైంది'అని యువీ పేర్కొన్నాడు.