సుశీల్ కుమార్ తప్పు చేస్తున్నాడు..!
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్‌లో ‘రియో ఒలింపిక్’ బెర్త్ వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఓవైపు రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు చివరి ప్రయత్నంగా స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. మరోవైపు.. 74 కేజీల విభాగంలో తానే బెస్ట్ అని రెజ్లర్ నర్సింగ్ యాదవ్ అంటున్నాడు. సుశీల్ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నర్సింగ్ మీడియాతో మాట్లాడాడు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) నిర్ణయాన్ని గౌరవించాలని సుశీల్ కు సూచించాడు. డబ్ల్యూఎఫ్‌ఐ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ ఇద్దరికి ట్రయల్స్ నిర్వహించాలని కోరుతూ సుశీల్ కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడాన్ని రియో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న రెజ్లర్ నర్సింగ్ యాదవ్ తప్పుబట్టాడు.
భారత రెజ్లింగ్ సమాఖ్య ఏ నిర్ణయం తీసుకున్నా సరే.. అందుకు తాను కట్టుబడి ఉంటానని నర్సింగ్ యాదవ్ స్పష్టచేశాడు. అసలు ఈ విషయంలో సుశీల్ కుమార్ కోర్టుకు వెళ్లవలసిన అవసరం ఏముందని వ్యాఖ్యానించాడు. ఇప్పటికే సుశీల్ తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర క్రీడా శాఖ, భారత ఒలింపిక్ సంఘం, రెజ్లింగ్ సమాఖ్య ప్రతినిధులకు అభ్యర్థించగా, ఎవ్వరి నుంచి కూడా సానుకూల స్పందన రాలేదన్న విషయం తెలిసిందే. దీంతో సుశీల్ చివరగా న్యాయస్థానంలోనే న్యాయం జరగుతుందని ట్రయల్స్ కోసం కోర్టుకు వెళ్లగా, అతడి నిర్ణయాన్ని నర్సింగ్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించాడు.