
అల్మాటీ (కజకిస్తాన్): ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో చివరిరోజు పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్‌కు ఒలింపిక్ బెర్త్ లభించకపోయినా రెండు కాంస్య పతకాలు దక్కాయి. సందీప్ సింగ్ (74 కేజీలు), సత్యవర్త్ (97 కేజీలు), సుమీత్ మలిక్ (125 కేజీలు) సెమీఫైనల్లోనే ఓడిపోయారు. ఫైనల్ చేరుకున్న వారికే టోక్యో ఒలింపిక్స్ బెర్త్ లభిస్తుంది.
సెమీస్‌లో ఓడిపోవడంతో కాంస్య పతకాల కోసం సందీప్, సత్యవర్త్, సుమీత్ పోటీపడ్డారు. కాంస్య పతకాల బౌట్‌లలో సత్యవర్త్ 5–0తో సపరోవ్ (తుర్క్‌మెనిస్తాన్)పై, సుమీత్ 5–0తో డాంగ్వాన్ కిమ్ (కొరియా)పై గెలుపొందగా... సందీప్ 4–14తో మెంగెజిగాన్ (చైనా) చేతిలో ఓడిపోయాడు.