'అప్పుడే నన్ను వీడ్కోలు చెప్పమన్నారు'
న్యూఢిల్లీ:ఒలింపిక్స్లో దేశం తరపున ఒక పతకం సాధించడమే అరుదు. అటువంటిది వరుసగా రెండు ఒలింపిక్స్ల్లో పాల్గొని పతకాలు సాధించడమంటే సాధారణ విషయం కాదు. 2008 బీజింగ్ ఒలింపిక్స్, 2012 లండన్ ఒలింపిక్స్ లలో పతకాలు సాధించిన ఘనత రెజ్లర్ సుశీల్ కుమార్ది. దీంతో భారత తరపున రెండు పతకాలు సాధించిన ఏకైక రెజ్లర్గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. కాగా, 2008 ఒలింపిక్స్ తరువాత సుశీల్ను కొంతమంది రెజ్లింగ్ నుంచి వీడ్కోలు చెప్పమని సలహా ఇచ్చారట. ఈ విషయాన్ని సుశీల్ తాజాగా వెల్లడించాడు.
'బీజింగ్ ఒలింపిక్స్ తరువాత ఇంటికొచ్చిన నాకు చేదు అనుభవం ఎదురైంది. ఆ ఒలింపిక్స్తో ఇక రెజ్లింగ్కు గుడ్బై చెప్పమని కొంతమంది సలహా ఇచ్చారు. దీంతో ఎటూ తోచని అయోమయ పరిస్థితికి గురయ్యా. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ తరువాత తిరిగి లండన్ ఒలింపిక్స్లో అడుగుపెట్టి స్వర్ణ పతకాన్ని సాధించే అవకాశాన్ని తృటిలో కోల్పోయా. నా అత్యుత్తమ పోటీని ఇవ్వలేకపోవడం వల్లే పసిడి కోల్పోయా. అయినప్పటికీ రెండు సార్లు పోడియం పొజిషన్ సాధించడం తృప్తిగా ఉంది' అని సుశీల్ కుమార్ పేర్కొన్నాడు.
ఈసారి జరిగే రియో ఒలింపిక్స్లో సుశీల్ కు అవకాశం దక్కని సంగతి తెలిసిందే. 74 కేజీల విభాగంలో మరో భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ అర్హత సాధించడంతో సుశీల్ అవకాశాలు దెబ్బతిన్నాయి. అయితే దీనిపై నర్సింగ్ యాదవ్తో ట్రయల్ నిర్వహించాలన్న వాదనను రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్యూఎఫ్ఐ) తోసిపుచ్చింది. దీంతో సుశీల్ స్థానం దక్కలేదు.