కుస్తీ రారాజుకు నిరాశే..!
న్యూఢిల్లీ: రెజ్లింగ్ లో భారత్ కు పతకాల పంట పండించిన రెజ్లర్ సుశీల్ కుమార్ కు నిరాశే ఎదురైంది. బీజింగ్ ఒలింపిక్స్ లో కాంస్యం, లండన్ ఒలింపిక్స్ లో రజతం నెగ్గిన సుశీల్ కు ఈ ఏడాది జరగనున్న రియో ఒలింపిక్స్ బెర్త్ దక్కలేదు. రెజ్లింగ్‌లో 74 కేజీల విభాగంలో నర్సింగ్ యాదవ్ ఆ అవకాశాన్ని సాధించాడు. రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన నర్సింగ్ యాదవ్ వైపు రెజ్లింగ్ సమాఖ్య మొగ్గు చూపింది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రకటించడంతో సుశీల్ కు నిరాశే మిగిలింది. వాస్తవానికి రెజ్లింగ్‌లో 74 కేజీల విభాగంలో పాల్గొంటామని ఇద్దరు రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ పోటీ పడుతున్నారు. భారత్ తరఫున ఈ కేటగిరిలో సుశీల్ (ఢిల్లీ), నర్సింగ్ (ముంబై) అత్యుత్తమ రెజ్లర్లు కాగా, కేవలం ఒకరికి మాత్రమే ఒలింపిక్ బెర్త్ దక్కుతుంది.
గతేడాది లాస్‌వేగాస్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నర్సింగ్ యాదవ్ 74 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గడంతోపాటు టాప్-6లో నిలిచి భారత్ కు ఆ కేటగిరీలో ఒలింపిక్ బెర్త్‌ను అందించాడు. ఆ ఈవెంట్‌కు వెళ్లాల్సిన సుశీల్ గాయం కారణంగా తప్పుకోవడంతో నర్సింగ్ ఆ అవకాశాన్ని అంది పుచ్చుకున్నాడు. ఒకసారి ఒక దేశానికి బెర్త్ దక్కాక... మరో క్రీడాకారుడు ఒలింపిక్ బెర్త్ కోసం పోటీపడకూడదు. గతంలో భారత్ కు ప్రాతినిధ్యం వహించడంతో పాటు పతకాలు తెచ్చానని తనకు ఈసారి మరో అవకావం ఇవ్వాలని పట్టుబడుతుండగా, భారత్ కు 74 కేజీల విభాగంలో అవకావం దక్కేలా చేసిన తనకే ఒలింపిక్ బెర్త్ దక్కుతుందని నర్సింగ్ యాదవ్ పేర్కొన్న విషయం తెలిసిందే.
ఒలింపిక్ బెర్త్ దక్కక పోవడంపై సుశీల్ కుమార్ స్పందించాడు. తమ ఇద్దరిలో ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారో వారినే ఒలింపిక్ బెర్త్ వరిస్తుందని పేర్కొన్నాడు.