హైకోర్టులో సుశీల్కు నిరాశ
ఢిల్లీ:రియో ఒలింపిక్స్లో భాగంగా రెజ్లర్ నర్సింగ్ యాదవ్తో సెలక్షన్ ట్రయల్ నిర్వహించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన మరో రెజ్లర్ సుశీల్ కుమార్కు నిరాశే ఎదురైంది. ఈ వ్యవహారంలో తమ జోక్యం అనవరసమని మంగళవారం విచారణ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. ఇద్దరు రెజ్లర్లకు ట్రయల్ నిర్వహించే అంశంలో తాము కల్పించుకోలేమని పేర్కొంది.
'గతంలో సుశీల్ చాలా సాధించాడు. కానీ రియోకు వెళ్లడానికి ఇది గ్రౌండ్ కాదు. ఒలింపిక్స్కు ఎవరిని పంపాలనే అంశంపై డబ్యూఎఫ్ఐకు అధికారం ఉంది. ఇదే సందర్భంలో నర్సింగ్ యాదవ్ ప్రదర్శనను తక్కువగా చూడొద్దు. అటు న్యాయంగా చూసినా, నైతికంగా చూసినా నర్సింగ్ లేకుండా మీ బెర్తుపై హామీ లేదు కదా' అని సుశీల్ కుమార్ను జడ్జి ప్రశ్నించారు. దేశంకోసం సుశీల్ చాలా సాధించినా, ఇలా ట్రయల్ నిర్వహించాలని కోరుతూ నర్సింగ్ యాదవ్ ను చిన్నబుచ్చటం తగదని పేర్కొన్నారు. రియో బెర్తుపై ఏమైనా అనుమానాలుంటే డబ్యూఎఫ్ఐతోనే తేల్చుకోవాలని సూచించారు.
గతేడాది లాస్‌వేగాస్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నర్సింగ్ యాదవ్ 74 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గడంతోపాటు టాప్-6లో నిలిచి భారత్ కు ఆ కేటగిరీలో ఒలింపిక్ బెర్త్‌ను అందించాడు. ఆ ఈవెంట్‌కు వెళ్లాల్సిన సుశీల్ గాయం కారణంగా తప్పుకోవడంతో నర్సింగ్ ఆ అవకాశాన్ని అంది పుచ్చుకున్నాడు. ఒకసారి ఒక దేశానికి బెర్త్ దక్కాక... మరో క్రీడాకారుడు ఒలింపిక్ బెర్త్ కోసం పోటీపడకూడదు. గతంలో భారత్ కు ప్రాతినిధ్యం వహించడంతో పాటు పతకాలు తెచ్చానని తనకు ఈసారి మరో అవకావం ఇవ్వాలని సుశీల్ కోరడంతో వివాదం ముదిరింది.