నర్సింగ్ నిషేధంపై సుశీల్ ఏమన్నాడంటే..
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ ముందు రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ వివాదంలో చిక్కుకోవడానికి మరో రెజ్లర్ సుశీల్ కుమార్ హస్తం ఉందనే వాదన బలంగా వినిపించింది. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలు ఏమీ లభించలేదు. కాగా, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా).. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో చేసిన సవాల్తో నర్సింగ్పై నాలుగేళ్ల నిషేధం పడింది. దాంతో రియో ఒలింపిక్స్లో పాల్గొనకుండానే నర్సింగ్ నిష్క్రమించాడు.
అయితే నర్సింగ్ యాదవ్ నిషేధంపై సుశీల్ కుమార్ మరోసారి పెదవి విప్పాడు. ఆ నిషేధాన్ని వాడా పునఃసమీక్షిస్తే నర్సింగ్ యాదవ్ కు ఊరట లభిస్తుందన్నాడు. అతనిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలన్నా, లేక తగ్గించాలన్ని అది కేవలం వాడా చేతుల్లోనే ఉందన్నాడు. ఏ ఒక్క రెజ్లర్ నిషేధానికి గురైనా అతని కెరీర్ దాదాపు ముగిసిపోయేట్ల్లేనని, అదే క్రమంలో రూల్స్ ద్వారా లబ్ధి పొందే అవకాశం కూడా లేకపోలేదన్నాడు.
ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్ నుంచి తాను అన్యూహ్యంగా వైదొలగడం మాత్రం ఇప్పటికీ క్షమించరానిదేనని సుశీల్ పేర్కొన్నాడు. తాను ఒలింపిక్స్ లో పాల్గొనకుండా వైదొలిగిన తీరును ఎప్పటికీ మరిచిపోలేనన్నాడు.