ఐ యామ్ బ్యాక్..ఇక నుంచి దూకుడే..
అంటిగ్వా: ఇక నుంచి విధ్వంసకర బ్యాటింగ్ తో జట్టుకు విజయాలందిస్తానని ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఆటతీరుపై స్పందించాడు. విండీస్ తో జరిగిన నాలుగో వన్డేలో చివర్లో అవుటై జట్టుకు విజయాన్నిందించ లేకపోయిన పాండ్యా తనకు తాను ఆత్మ పరిశీలన చేసుకున్నానని పేర్కొన్నాడు. ఇక నుంచి ఎలాంటి పరిస్థితుల్లోనైనా భయం లేని ఆటతో దూకుడుగా ఆడుతానని స్పష్టం చేశాడు. విండీస్ తో నాలుగో వన్డేలో భారత్ 11 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే.
ధోని-పాండ్యా క్రీజులో ఉండగా భారత్ విజయానికి 31 బంతుల్లో 29 పరుగులు అవసరం. కానీ ఈ జోడి ఆ పరుగులు రాబట్టలేక పోయింది. దీనిపై స్పందించిన పాండ్యా 'మ్యాచ్ గెలుస్తామనుకున్నాం కానీ ఓడిపోయాం. ఈ మ్యాచ్ తో చాల నేర్చుకున్నాను. ఇక కొన్ని మ్యాచ్ లో క్లిక్ అవ్వలేదు. మాకు ఫైనల్ పై ఎలాంటి భయం లేదు. మేము మంచి క్రికెట్ ఆడుతున్నాం. ఇక విండీస్ పిచ్ పరిస్థితుల గురించి ముంబై ఇండియన్స్ బ్రదర్స్ పొలార్డ్, సిమన్స్ లను అడిగి తెలుసుకున్నా అని తెలిపాడు. వారు బ్రదర్స్ లా సలహాలిచ్చారని, ఆటను ఆస్వాదిస్తూ ఆడమన్నారని తెలిపాడు'. ఆల్ రౌండర్ గా జట్టుకు విజయాలందిస్తానని పాండ్యా ధీమా వ్యక్తం చేశాడు. ఇక ఈ స్టైలిష్ ప్లేయర్ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో వరుస సిక్స్ లతో మ్యాచ్ గెలిపించెంత పనిచేసి జడేజాతో సమన్వయ లోపం వల్ల రనౌట్ అయ్యాడు. బౌలింగ్, దూకుడు బ్యాటింగ్ తో ఈ ఆల్ రౌండర్ క్రికెట్ అభిమానుల మనసును దోచుకున్నాడు.