'కోహ్లిలా ఆడాలని ఉంది'
న్యూఢిల్లీ:టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిలా దూకుడుగా ఆడాలని ఉందంటూ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ స్పష్టం చేసింది. ఆదివారం ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్ను గెలిచిన సైనాకు అభినందనలు పోటెత్తిన సంగతి తెలిసిందే. ఇలా సైనాను అభినందించిన వారిలో విరాట్ కోహ్లి కూడా ఉన్నాడు. 'నిన్ను చూసి దేశం గర్విస్తోంది. నీ ఆట తీరు చూసి చాలా సంతోషంగా ఉంది. నీలా విజయాలు సాధించాలని ఉంది' అని కోహ్లి ట్వీట్ చేశాడు.
దీనికి బదులుగా సైనా కూడా విరాట్ ను అభినందిస్తూ మరో ట్వీట్ చేసింది. 'నీలా దూకుడుగా ఆడాలని ఉంది. విజయాలు సాధించడానికి నీవు చూపించే దూకుడు అమోఘం. నేను కూడా అలా ఆడాలని అనుకుంటున్నా. దానికోసం శ్రమిస్తా'అని సైనా పేర్కొంది. ఈ ఏడాది ఒక్కసారి కూడా సెమీ ఫైనల్ అడ్డంకిని అధిగమించలేక పోయిన హైదరాబాద్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తన సత్తా చాటుకుంటూ ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.