
నాకైతే కుంబ్లేతో నో ప్రోబ్లం..!
న్యూఢిల్లీ:గత కొన్ని రోజుల క్రితం భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. జట్టులోని ఆటగాళ్లతో అంతగా సఖ్యత లేకపోవడంతోనే కుంబ్లే అర్థాంతరంగా తన పదవిని వదలుకున్నాడు. ఇందుకు కారణం తమతో కుంబ్లే అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నాడని అత్యధిక శాతం మంది తేల్చిచెప్పడమే. మరి తనకు కుంబ్లేతో ఎటువంటి ప్రోబ్లం లేదని అంటున్నాడు వికెట్ కీపర్ వృద్ధిమాన్. ' కుంబ్లే వ్యవహారంలో సహచరులు గురించి నాకు తెలీదు. నావరకూ అయితే కుంబ్లే ఓకే. నేను ఎప్పుడూ కుంబ్లే కఠినంగా వ్యవహరించిన క్షణాల్ని చూడలేదు. కుంబ్లే కఠినంగా ఉంటున్నాడని కొంతమంది అనుకుని ఉండొచ్చు.. మరికొంతమందికి కుంబ్లేతో ఇబ్బంది ఉండకపోవచ్చు. నేనైతే కుంబ్లే కఠినంగా ఉండటాన్ని చూడలేదు. ఒక కోచ్ గా చేసేటప్పుడు కొన్ని సందర్బాల్లో కఠినంగా ఉండాలి. నేను అనిల్ భాయ్ శిక్షణలో ఇబ్బందిగా ఫీల్ కాలేదు'అని సాహా పేర్కొన్నాడు.
కుంబ్లే ఎప్పుడూ 400 నుంచి 500 వరకూ పరుగులు చేయమనేవాడని, అదే సమయంలో అవతలి జట్టును 150 లోపు ఆలౌట్ చేయాలనే వాడని సాహా తెలిపాడు. అయితే అలా చేయడం అన్నిసార్లు సాధ్యం కాదని ఒప్పుకున్న సాహా.. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి మాత్రం అవతలి జట్టుపై విరుచుకుపడమని మాత్రమే చెబుతాడన్నాడు. ఇదే వారిద్దరిలో ఉన్న వ్యత్యాసమన్నాడు.