'కుంబ్లే కోచింగ్ బాగుండేది'
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా పనిచేసి, ఇటీవల ఆ పదవి నుంచి వైదొలిగిన అనిల్ కుంబ్లే పర్యవేక్షణకు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా మద్దతుగా నిలిచాడు. అత్యధిక మంది భారత క్రికెట్ సభ్యులకు కుంబ్లే కోచింగ్ నచ్చలేదనే వార్తల నేపథ్యంలో సాహా స్పందించాడు. అసలు కుంబ్లే కోచింగ్ తో తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశాడు. భారత క్రికెటర్ల పట్ల కుంబ్లే 'హెడ్ మాస్టర్' లా ఉంటూ కఠినంగా ప్రవర్తించేవాడనే వార్తలను సాహా ఖండించాడు.
'కుంబ్లే పర్యవేక్షణలో డ్రెస్సింగ్ రూమ్ లో ఆహ్లాదకరమైన వాతావారణం ఉండేది. నేను చూసినంత వరకూ మేమంతా జోక్లు వేసుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్లం. నాతో పాటు ప్రతీ ఒక్కరితోనూ కుంబ్లే సరదాగా ఉండేవాడు. ముఖ్యంగా కుంబ్లే కోచ్ అయిన తరువాత వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాం. అక్కడ నాకు అతని అనుభవం బాగా ఉపయోగపడింది. ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడమని కుంబ్లే చెప్పేవాడు. దాంతో పాటు చక్కటి సలహాలు కూడా ఇచ్చేవాడు. ఇది నేను టెస్టులు ఆడేటప్పుడు నాకు తెలిసిన అనిల్ గురించి చెబుతున్న విషయాలు. మరి వన్డేల్లో కుంబ్లే ఎలా ఉండేవాడో నాకైతే తెలియదు. కుంబ్లే పర్యవేక్షణలో ఉన్న సరదా సరదా వాతావరణం కొత్త కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో కూడా ఉంటుందని అనుకుంటున్నా'అని సాహా పేర్కొన్నాడు.