కొత్త కోచ్ కావలెను: బీసీసీఐ
ముంబై: టీమిండియా ప్రధాన కోచ్ కోసం అన్వేషణ మొదలుపెట్టింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ). దీనిలో భాగంగా ఆసక్తిగల అభ్యర్ధుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. త్వరలో ప్రస్తుత ప్రధాన కోచ్ గా ఉన్న అనిల్ కుంబ్లే పదవీ కాలం ముగిసిపోతున్న తరుణంలో కొత్త కోచ్ కు సంబంధించి దరఖాస్తుల్ని ఆహ్వానించింది. 'పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ కు కోసం ఆప్లికేషన్స్ ఆహ్వానిస్తున్నాం. ఆసక్తిగల అభ్యర్ధులు ఆ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు'అని బీసీసీఐ సెక్రటరీ అమితాబ్ చౌదరి పేర్కొన్నారు.
ఇంగ్లండ్ లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ వరకూ మాత్రమే అనిల్ కుంబ్లే ప్రధాన కోచ్ గా ఉండనున్నారు. అయితే ఆ తరువాత మరొకరికి కొత్తగా బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ యోచిస్తోంది. అదే క్రమంలో కుంబ్లేను టీమిండియా డైరెక్టర్ గా నియమించాలని చూస్తోంది. ఒకవేళ చాంపియన్స్ ట్రోఫీ ముగిసే నాటికి కొత్త కోచ్ నియమాకం జరకపోతే కుంబ్లేనే ఆ బాధ్యతల్లో కొనసాగుతాడు.కొత్త కోచ్ నియమాకాన్ని బీసీసీఐ పరిపాలన కమిటీ(సీఓఏ)తో పాటు క్రికెట్ అడ్వైజరీ కమిటీ పర్యవేక్షించనుంది.