న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో చరిత్రను పునరావతం చేస్తానని అంటున్నాడు భారత అగ్రశ్రేణి టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు ఆచంట శరత్ కమల్. 12ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా వేదికగా మెల్‌బోర్న్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల సింగిల్స్, టీమ్ విభాగాల్లో శరత్ విజేతగా నిలిచి రెండు స్వర్ణాలను సాధించాడు. ఏప్రిల్ 4 నుంచి 15 వరకు ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరగబోయే కామన్వెల్త్ క్రీడల్లోనూ రెండు పసిడి పతకాలను సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతానని పేర్కొన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో జన్మించి తమిళనాడులో స్థిరపడిన శరత్ కమల్ ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 71వ స్థానంలో ఉన్నాడు.
ఇటీవల జరిగిన ఖతర్ ఓపెన్ టోర్నీలో ప్రపంచ ఏడో ర్యాంకర్ కోకి నివాకు షాకిచ్చి తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని అందుకున్నాడు. ఈ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో సత్తా చాటుతానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ‘కామన్వెల్త్‌లో ఈసారి పాల్గొంటున్న భారత జట్టు అత్యుత్తమమైనది. ప్రపంచంలో టాప్–100లో ఉన్న ఆరుగురు క్రీడాకారులు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టోర్నీలో పోటీపడుతోన్న నాలుగు కేటగిరీల్లోనూ (సింగిల్స్, డబుల్స్, టీమ్, మిక్స్‌డ్ డబుల్స్) మనకు పతకాలు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి’ అని 35 ఏళ్ల వెటరన్ ప్లేయర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
నాలుగేళ్ల క్రితం జరిగిన గ్లాస్గో గేమ్స్‌లో భారత్ కేవలం ఒక రజతంతో సరిపెట్టుకుంది. ఈ క్రీడల చరిత్రలో భారత్‌కు ఇదే అత్యల్ప ప్రదర్శనని శరత్ అన్నాడు. ‘కామన్వెల్త్‌లోనే మనం ఎక్కువ పతకాలు సాధించే వీలుంది. కానీ ఇంగ్లండ్, నైజీరియా ఆటగాళ్లు చెలరేగడంతో గ్లాస్గోలో భారత్‌కు నిరాశపరిచే ఫలితాలు వచ్చాయి. కేవలం ఒకే పతకంతో సరిపెట్టుకున్నాం. ఇది భారత్‌కు పతకాల పరంగా అత్యల్ప ప్రదర్శన. దీంతో గోల్డ్‌కోస్ట్‌లో పాల్గొనే బందంపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. మేం దానికి సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం సింగపూర్ నుంచి కూడా పోటీ ఎదురవుతోంది. కోచ్ మాస్సిమో కోస్టాంటిని పర్యవేక్షణలో భారత బందం యూరోప్‌లో సన్నద్ధమవుతోంది. సెప్టెంబర్ నుంచి మా సన్నాహాలు జరుగుతున్నాయి. కచ్చితంగా ఈసారి మంచి ఫలితాలు సాధిస్తాం’ అని కమల్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment