‘వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా రోహిత్‌ | ICC Awards: Rohit Sharma ODI Cricketer Of 2019 | Sakshi
Sakshi News home page

‘వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా రోహిత్‌

Published Fri, Jan 17 2020 1:16 AM | Last Updated on Fri, Jan 17 2020 9:35 AM

ICC Awards: Rohit Sharma ODI Cricketer Of 2019 - Sakshi

దుబాయ్‌: ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) వార్షిక అవార్డుల్లో ఉత్తమ ఆటగాడిగా గార్‌ఫీల్డ్‌ గారీ సోబర్స్‌ పురస్కారానికి ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఎంపికయ్యాడు. వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్లో 98 బంతుల్లో 84 పరుగులు చేసిన అతను తమ జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత హెడింగ్లీలో జరిగిన యాషెస్‌ టెస్టులో 135 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు.

2019లో వన్డేల్లో 12, టెస్టుల్లో 22 వికెట్లు కూడా తీసిన స్టోక్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనను ఐసీసీ గుర్తించింది. ఈ ఏడాది అత్యుత్తమ వన్డే ఆటగాడిగా భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ నిలిచాడు. ప్రపంచ కప్‌లో ఏకంగా ఐదు సెంచరీలు సహా 81 సగటుతో రోహిత్‌ 648 పరుగులు సాధించాడు. అత్యుత్తమ టెస్టు ఆటగాడి అవార్డు ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌కు దక్కింది. 2019లో కమిన్స్‌ 59 వికెట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.

చాహర్‌ సూపర్‌... 
టి20ల్లో అత్యుత్తమ ప్రదర్శనగా భారత బౌలర్‌ దీపక్‌ చాహర్‌ మ్యాజిక్‌ స్పెల్‌ ఎంపికైంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహర్‌ 7 పరుగులే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇందులో హ్యాట్రిక్‌ కూడా ఉంది. ఉత్తమ అంపైర్‌గా రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌ ఎంపికయ్యాడు. ఎమర్జింగ్‌ క్రికెటర్‌ అవార్డు మార్నస్‌ లబ్‌షేన్‌ (ఆస్ట్రేలియా)కు దక్కింది.

కోహ్లి క్రీడా స్ఫూర్తి... 

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మైదానంలో ప్రవర్తన ‘స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌’ అవార్డుకు ఎంపికైంది. ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత ప్రేక్షకులు స్టీవ్‌ స్మిత్‌ను హేళన చేస్తుండగా... వద్దని వారించిన కోహ్లి చప్పట్లతో ప్రోత్సహించమని కోరి అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. ‘ఎన్నో ఏళ్లుగా మైదానంలో తప్పుడు ప్రవర్తన కారణంగానే చెడ్డపేరు తెచ్చుకున్న నాకు ఈ అవార్డు రావడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. మన అభిమానులు స్మిత్‌ను అలా చేయడం ఆ క్షణంలో తప్పనిపించింది. అందుకే కలగజేసుకున్నాను’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు.

ఐసీసీ టెస్టు జట్టు 
కోహ్లి (కెప్టెన్‌),  మయాంక్, లాథమ్, లబ్‌షేన్, స్మిత్, స్టోక్స్, వాట్లింగ్, కమిన్స్, స్టార్క్, వాగ్నర్, లయన్‌

ఐసీసీ వన్డే జట్టు
కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, షై హోప్, బాబర్‌ ఆజమ్,  విలియమ్సన్, స్టోక్స్, బట్లర్, స్టార్క్, బౌల్ట్, షమీ, కుల్దీప్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement