![ICC bans smart watches from field, dressing rooms - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/26/PAK-WATCH-SMAT.jpg.webp?itok=4VJXk0Xj)
దుబాయ్: ఆటలో అక్రమాలకు ఆస్కారమిచ్చే ఏ మార్గాన్నీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఉపేక్షించబోమంటోంది. ఇందులో భాగంగా డ్రెస్సింగ్ రూమ్, మైదానంలోకి ఎటువంటి సమాచార సాధనాలు తీసుకెళ్లరాదని నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఆటగాళ్లు, మ్యాచ్ అధికారుల ప్రాంతం (పీఎంఓఏ)లో స్మార్ట్ వాచ్‌లు ధరించవద్దని పేర్కొంటూ ఈ మేరకు శుక్రవారం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ‘ఫోన్ లేదా వైఫైతో అనుసంధానమై సమాచారాన్ని స్వీకరించగల స్మార్ట్ వాచ్‌లను ధరించవద్దని క్రికెటర్లకు గుర్తు చేస్తున్నాం. అలాంటివి ఏమైనా ఉంటే మైదానానికి చేరిన వెంటనే ఫోన్‌తో పాటు అప్పగించేయాలి’ అని నిర్దేశించింది. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో తొలి టెస్టు సందర్భంగా పాకిస్తాన్ ఆటగాళ్లు స్మార్ట్ వాచ్‌లు ధరించడంతో ఈ అంశం చర్చకు తావిచ్చింది.
ఇది మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఆరోపణలకు దారితీస్తుందేమోనని భావించిన ఐసీసీ... తక్షణమే అప్రమత్తమైంది. క్రీడాకారులు ఈ తరహా పరికరాలను గ్రౌండ్‌లోకి తేవడంపై నిషేధం ఉంది. తాజా ఆదేశాల్లో దానిని డ్రెస్సింగ్ రూమ్‌కూ వర్తింపజేశారు. సహచరులతో సంభాషించేందుకు మ్యాచ్ అధికారులకు మాత్రం ప్రత్యేక పరికరాలను అనుమతిస్తారు. మరోవైపు గత నవంబరులో న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా డగౌట్‌లో ఉన్న భారత కెప్టెన్ కోహ్లి వాకీటాకీలో మాట్లాడటం కెమెరాకు చిక్కింది. ఇది చర్చకు దారితీసింది.
Comments
Please login to add a commentAdd a comment