పాక్ కెప్టెన్ కొడుకుతో ధోని.. ఫొటో వైరల్
సాధారణంగా క్రీడలంటేనే సరిహద్దులు లేనివి.. హద్దులకు మించినవి. పోటీ మైదానానికే వదిలేయాలి తప్ప వ్యక్తిగతంగా మోసుకురావొద్దు.. అభిప్రాయ బేధాలు ఉంటే వ్యవస్థకు అపాధించాలే తప్ప వ్యక్తులపై రుద్దొద్దు. సరిగ్గా అదే అంశాన్ని రూఢీ చేసేలా ఇప్పుడు ఓ ఛాయా చిత్రం ఆన్‌లైన్‌లో తెగ హల్ చల్ చేస్తోంది. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అత్యంత అరుదైన ఫొటోను నెట్‌లో పంచుకున్నారు. పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ సర్ఫ్రాజ్ అహ్మద్ కుమారుడు అబ్దుల్లాను ఎత్తుకొని ముద్దుచేస్తున్నదే ఆ ఫొటో.
ఆదివారం దాయాది పాక్, భారత్‌కు మధ్య ఉత్కంఠ భరిత స్థాయిలో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కెన్నింగ్టన్ ఓవల్‌లో జరగనున్న విషయం తెలిసిందే. సాధారణంగా పాక్, ఇండియా మ్యాచ్ అంటేనే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆట ముగిసినా వారంపాటు దాని ప్రభావం ఇరు దేశాల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ధోనీ పోస్ట్ చేసిన ఈ ఫొటో ఇప్పుడు భారత, పాకిస్థాన్ క్రికెట్ అభిమానులను కట్టిపడేస్తోంది. ఇరు దేశాల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇరు దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలు ఇలాగే ఉంటే బావుంటుందంటూ వారు కోరుతున్నారు. చాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికే ఓసారి పాక్‌ను ఓడించిన భారత్ ఫైనల్‌లో కూడా విజయ దుందుభి మోగిస్తామనే ధీమాతో ఉంది.