ధోని తీరు ఆశ్చర్యం కలిగించింది!
కరాచీ: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీతో పాక్‌కు విజయాన్నందించిన ఆ దేశ యువ ఆటగాడు ఫకార్ జమాన్ భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బుమ్రా నోబాల్‌తో బతికిపోయిన ఈ యువఆటగాడు అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోని కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. అయితే తను సెంచరీ చేసిన అనంతరం భారత కీపర్ మహేంద్ర సింగ్ ధోని తీరు తనని ఆశ్చర్యానికి గురిచేసిందని జమాన్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
తనను అవుట్ చేయడానికి కెప్టెన్ కోహ్లీ ఇతర ఆటగాళ్లు శతవిధాల ప్రయత్నించారు. సెంచరీ అనంతరం గ్రౌండ్‌ను చూస్తూ చప్పట్లు కొట్టారు కానీ ధోని నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదని ఇది తనని ఆశ్చర్యానికి గురిచేసిందని జమాన్ చెప్పుకొచ్చాడు. అయితే బుమ్రా బౌలింగ్‌లో అవుటైనప్పుడు నా కలలన్నీ ఆవిరయ్యాయని, తీవ్ర నిరాశతో డ్రెస్సింగ్ రూం వైపు అడుగులు వేయడం మొదలు పెట్టాను. ఇంతలో అంపైర్ తన వద్దకు వచ్చి ఆగమని చెప్పడంతో ఆశలు చిగురించాయి. దీంతో కొత్త లైఫ్ దొరికినట్లు ఫీలైనా అని జమాన్ వివరించాడు.