ధోని ముందు మూడు రికార్డులు..
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని ముందు మూడు ప్రపంచ రికార్డులున్నాయి. శ్రీలంకతో గురువారం జరగబోయే నాలుగో వన్డే ధోనికి 300వ మ్యాచ్ కానుంది. ఇది ధోని కెరీర్‌లో ఒక మైలురాయి కాగా మరో రెండు అరుదైన రికార్డుల చేరువలో ఈ మిస్టర్ కూల్ ఉన్నాడు. ఇప్పటికే 99 స్టంపింగ్స్‌తో సంగక్కరతో రికార్డును పంచుకోగా ఈ మ్యాచ్‌లో ధోని మరో స్టంప్ అవుట్ చేస్తే సెంచరీ స్టంప్ అవుట్‌లు సాధించిన ఎకైక వికెట్ కీపర్‌గా గుర్తింపు పొందనున్నాడు.
ఇక నాటౌట్‌ల పరంగా ధోని 72 సార్లు నాటౌట్‌గా నిలిచి పొలాక్, చమిందావాస్‌ల సరసన చేరాడు. ఇదే మ్యాచ్‌లో మరోసారి నాటౌట్‌గా నిలిస్తే ఈ రికార్డు కూడా ధోని ఖాతాలో చేరనుంది. ఇక శ్రీలంకతో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ ఇప్పటికే 3 వన్డేలు నెగ్గి సిరీస్ కైవసం చేసుకోంది. వన్డే సిరీస్‌ను కూడా క్లీన్‌స్వీప్ చేయాలని కోహ్లి సేన భావిస్తోంది.