సుప్రీం కోర్టులో ధోనీకి భారీ ఊరట
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ధోనీపై దాఖలు చేసిన క్రిమినల్ కేసు పిటీషన్‌ను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.
2013, ఏప్రిల్‌లో బిజినెస్ టుడే మేగజైన్ కవర్‌పై విష్ణుమూర్తి ఆకారంలో ధోని ముఖచిత్రం ప్రచురితమైంది. దీంట్లో ధోని చేతుల్లో తను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న వస్తువులతో పాటు షూస్‌ను కూడా ఉంచారు. ఈ ఫొటో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ అప్పట్లో అనంతపురం జిల్లా కోర్టులో కేసు వేశారు. బెంగళూరు కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఆ తర్వాత ఈ కేసు సుప్రీం కోర్టుకు వెళ్లింది.
ఈ ఫొటో వివాదంలో ధోనీ ప్రమేయం లేదని కేసును కొట్టివేయాల్సిందిగా అతని తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పు వెలువరిస్తూ.. ధోనీ ఉద్దేశపూర్వకంగా లేదా కించపరచాలనే భావనతో చేయలేదని పేర్కొంటూ కేసును కొట్టివేసింది. కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ధోనీకి ఈ కేసు నుంచి ఉపశమనం లభించడం ఊరట కలిగిస్తోంది. ఐపీఎల్‌లో పుణె సూపర్‌జెయింట్స్ జట్టు కెప్టెన్సీ నుంచి ధోనీని తొలగించిన సంగతి తెలిసిందే. పైగా తాజా సీజన్‌లో ధోనీ స్థాయికి తగ్గట్టు బ్యాటింగ్‌లో రాణించలేకపోవడంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.