మళ్లీ ఐసీసీ-బీసీసీఐ వార్!
భారత మహిళా జట్టు
పాయింట్లు తగ్గించిన ఐసీసీ
పాక్‌తో క్రికెట్ ఆడనందుకు శిక్ష
చాంపియన్‌స ట్రోఫీనుంచి తప్పుకుంటామన్న బోర్డు
దుబాయ్: ఐసీసీ చైర్మన్‌గా శశాంక్ మనోహర్ ఎన్నికైన నాటినుంచి ఐసీసీ, బీసీసీఐ మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. తాజాగా భారత మహిళా క్రికెట్ జట్టు విషయంలో ఐసీసీ తీసుకున్న నిర్ణయం బీసీసీఐకి ఆగ్రహం తెప్పించింది. షెడ్యూల్ ప్రకారం ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆగస్టు 1నుంచి అక్టోబర్ 31 మధ్య భారత్, పాకిస్తాన్ జట్లు కనీసం మూడు వన్డేల్లో తలపడాల్సి ఉంది. దీని నిర్వహణ బాధ్యతలు పాకిస్తాన్ బోర్డువి కాగా వారు యూఏఈలో నిర్వహిస్తామని ముందుకు వచ్చారు.
అయితే ఇరు దేశాల మధ్య నెలకొన్న తాజా పరిస్థితుల కారణంగా బీసీసీఐ ఈ సిరీస్‌లో ఆడేందుకు ఆసక్తి చూపించలేదు. దాంతో ఆ మూడు వన్డేలు భారత్ ఓడినట్లుగా భావిస్తూ ఐసీసీ టెక్నికల్ కమిటీ, పాకిస్తాన్‌కు 6 పాయింట్లు ఇచ్చేసింది. ‘ఈ సిరీస్‌లో ఆడకపోవడానికి బీసీసీఐ సరైన కారణం చూపించలేదు. అందుకే నిబంధనల ప్రకారం భారత పాయింట్లలో కోత విధించాం. అవే పాయింట్లు పాక్‌కు ఇచ్చాం’ అని ఐసీసీ ప్రకటించింది. అరుుతే ఈ చర్యపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. ఐసీసీ తమ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే చాంపియన్‌స ట్రోఫీనుంచి తప్పుకుంటామని కూడా హెచ్చరించింది. ‘నిబంధనల పేరిట ఐసీసీ మన మహిళల జట్టును ‘టార్గెట్’ చేసింది. భారత్, పాక్ సరిహద్దులో పరిస్థితి ఎలా ఉందో ఐసీసీకి తెలుసు.
ఇప్పటి వరకు బీసీసీఐ వ్యతిరేకిగా వ్యవహరించిన మనోహర్, ఇప్పుడు భారత దేశ వ్యతిరేకిగా కూడా మారిపోయారు. మహిళా జట్టుకు మద్దతుగా పురుషుల చాంపియన్‌స ట్రోఫీని కూడా బహిష్కరిస్తాం’ అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మరో వైపు ఐసీసీ నిర్ణయాన్ని పాకిస్తాన్ బోర్డు ఆహ్వానించింది. మరో వైపు ఈ నెల 26నుంచి డిసెంబర్ 4 వరకు మహిళల ఆసియా కప్ టోర్నీ థారుులాండ్‌తో జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 29న జరిగే మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ తలపడాల్సి ఉంది. మన జట్టును ఈ టోర్నీకి బోర్డు పంపిస్తుందా, ఒక వేళ వెళ్లినా పాక్‌తో ఆడనిస్తుందా అనేదానిపై స్పష్టత లేదు. పాక్‌తో మ్యాచ్ పాయింట్లు కోల్పోవడంతో 2017 వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనాలంటే భారత జట్టు క్వాలిఫరుుంగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.