
క్రిస్ గేల్, మొహమ్మద్ షహజాద్ చిందులు
సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ క్రికెట్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు క్రీడా అభిమానులకు వెగటు పుట్టిస్తున్నాయి. మైదానంలో ఆటగాళ్లు కనీస క్రీడా స్పూర్తి మరిచి ప్రవర్తిస్తున్నారు. జట్టు విజయం కోసం ఎలాంటి అడ్డదార్లు తొక్కడానికైనా సిద్దపడుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బాల్ ట్యాంపరింగ్‌కు చేయాలని ఆటగాళ్లు ప్రోత్సహించడం ప్రపంచ వ్యాప్తంగాతీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. ఇక అంతక ముందు దక్షిణాఫ్రికా బౌలర్ రబడ వికెట్ తీసిన ఆనందంలో స్మిత్‌ను ఢీకొట్టడం.. వార్నర్- డికాక్‌ల వివాదం.. నిదహాస్ ట్రోఫీలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు నాగిని డ్యాన్స్‌లతో అతిగా ప్రవర్తించడం వంటి ఘటనలు చూసి అసలేమైంది ఈ క్రికెటర్లకు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో అఫ్గానిస్తాన్, వెస్టిండీస్ ఆటగాళ్లు చూపించిన క్రీడా సూర్తి.. వివాదాల్లో చిక్కుకున్న ఆటగాళ్లందరికి ఆదర్శంగా నిలుస్తోంది. అవును అభిమానులు, క్రీడా విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే మీరు కూడా అదే అంటారు. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ ఫైనల్లో విండీస్‌పై పసికూన అఫ్గానిస్తాన్ 7 వికెట్ల తేడాతో సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఓడినా ఏ మాత్రం బాధపడని విండీస్ ఆటగాళ్లు అఫ్గాన్ ఆటగాళ్లతో మైదానంలో చిందేశారు. ‘ఇది అసలైన క్రీడాస్పూర్తి’ అని ఐసీసీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment