
మెల్‌బోర్న్: కరోనా తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టి20 ప్రపంచకప్ వాయిదా పడనుందనే ఊహాగానాలు నిజమయ్యేలా ఉన్నాయి. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం సన్నద్ధమవ్వాలంటూ ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఆదేశాలు వచ్చినట్లు స్థానిక మీడియా ప్రకటించడంతో ఈ వార్తలకు మరింత ఊతం లభించినట్లయింది.
ఆసీస్ మీడియా కథనాల ప్రకారం లాజిస్టిక్ సమస్యల కారణంగా అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరగాల్సిన ఈ మెగా ఈవెంట్ వాయిదా వేసేందుకు ఐసీసీ సిద్ధమైందని... వారంలోపు దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో అక్టోబర్–నవంబర్ సమయాన్ని ఐపీఎల్ కోసం కేటాయించే అవకాశముంది. ‘టి20 వరల్డ్‌కప్ వాయిదాపై ఈ వారంలో అధికారిక ప్రకటన రానుంది. ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం సిద్ధమవ్వాలని ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెటర్లకు సమాచారం ఇచ్చారు. కానీ సిరీస్ గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇంగ్లండ్‌తో సిరీస్ తర్వాత నేరుగా అక్కడి నుంచే ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్ కోసం భారత్ చేరుకుంటారు’ అని మీడియాలో వార్తలు వచ్చాయి.