వాయిదా వైపే అడుగులు | ICC Discussed About T20 World Cup In Board Meeting | Sakshi
Sakshi News home page

వాయిదా వైపే అడుగులు

May 28 2020 12:13 AM | Updated on May 28 2020 12:13 AM

ICC Discussed About T20 World Cup In Board Meeting - Sakshi

న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్‌ నిర్వహణపై అందరూ భయపడినట్లే జరిగేలా ఉంది. ఇప్పటికే ఈ టోర్నీపై అనేక ఊహాగానాలు ప్రచారంలోకి రాగా ఇప్పుడవే నిజమయ్యేలా ఉన్నాయి. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌–నవంబర్‌ లలో జరగాల్సిన పొట్టి ప్రపంచకప్‌... 2022కి వాయిదా పడే అవకాశమున్నట్లు ఐసీసీ వర్గాలు బుధవారం వెల్లడించాయి. గురువారం టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్న అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) బోర్డు సమావేశంలో ఈ అంశంపై సూత్రప్రాయ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ‘టి20 ప్రపంచకప్‌ వాయిదాకు ఎక్కువ అవకాశముంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ టోర్నీని నిర్వహించలేం. బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు. అయితే దాన్ని ప్రకటిస్తారా? లేదా? అనేది తెలియదు’ అని ఐసీసీ బోర్డు సభ్యుడొకరు వెల్లడించారు. మరోవైపు 2021లో భారత్‌ ఆతిథ్యమివ్వనున్న టి20 ప్రపంచకప్‌ యథావిధిగా జరుగనుంది.

ఈ ఏడాది జరుగనున్న టోర్నీని మాత్రమే 2022కు వాయిదా వేయనున్నారు. టోర్నీ వాయిదాపై నిర్ణయం తీసుకున్నట్లు వస్తోన్న వార్తలు సరైనవి కావని ఐసీసీ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో అందుబాటులో ఉన్న అవకాశాలను మాత్రమే పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. ‘ఇది కేవలం ఐసీసీ సభ్య దేశాల సమస్య మాత్రమే కాదు. ఐసీసీ ఈవెంట్స్‌తో పాటు ఐపీఎల్, భారత క్రికెట్‌ మ్యాచ్‌ల ప్రసారహక్కులు దక్కించుకున్న స్టార్‌ స్పోర్ట్స్‌ గురించి కూడా ఆలోచించాలి’ అని ఆయన అన్నారు. మరోవైపు ప్రపంచకప్‌ స్థానంలో ఐపీఎల్‌ నిర్వహణ అనేది భారత్‌లో పరిస్థితులపై ఆధారపడనుంది. ప్రేక్షకులు, విదేశీ ఆటగాళ్లకు ప్రయాణ ఆంక్షలు, క్వారంటైన్‌ నిబంధనలు ఇలా అనేక అంశాలు దీనితో ముడిపడి ఉన్నాయి. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే ప్రపంచకప్‌నకు సంబంధించి పన్ను మినహాయింపుపై కూడా ఐసీసీ బోర్డు సమావేశంలో చర్చించనుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ అంశంపై ఇప్పుడే స్పందించలేమని బీసీసీఐ పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement