
బంతి వికెట్లకు తగిలినా కిందపడని బెయిల్స్
లండన్ : వికెట్లకు జిగురులా అతుక్కుపోతున్న జింగ్ బెయిల్స్‌ను ఇప్పుడు మార్చడం కుదరదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్పష్టం చేసింది. ఐపీఎల్, ప్రపంచకప్ టోర్నీల్లో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చె బంతులు తాకినా బెయిల్స్ కిందపడకపోవడం పలు అనుమానాలకు దారి తీసింది. ఇలా బెయిల్స్ కిందపడకపోవడంతో కీలక బ్యాట్స్‌మెన్ బతికిపోవడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపుతుంది. ఇటీవల భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ డెవిడ్ వార్నర్ ఇలానే బతికిపోయాడు. బుమ్రావేసిన రెండో ఓవర్‌లో అతను డిఫెన్స్ చేయబోగా.. ఆ బంతి నేరుగా వికెట్లకు తగిలింది. కానీ బెయిల్స్ కిందపడక లైఫ్ వచ్చింది.
ఇక మ్యాచ్ అనంతరం ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఈ వ్యవహారంపై విచారం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మ్యాచ్‌లో ఇలాంటివి కచ్చితంగా ఊహించలేమన్నారు. సాధారణ బెయిల్స్ కంటే జింగ్ బెయిల్స్ మూడింతల బరువు ఉండటం వల్లే అవి కింద పడటం లేదని, వెంటనే వాటిని మార్చేయాలని కోహ్లి, ఫించ్‌లతో పాటు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్, అభిమానులు ఐసీసీని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఐసీసీ స్పందిస్తూ.. మెగా ఈవెంట్ మధ్యలో మార్చడం కుదరదని స్పష్టం చేసింది.
‘మేం టోర్నీ మధ్యలో ఏలాంటివి మార్చలేం. అలా చేస్తే టోర్నీ సమగ్రత దెబ్బతింటుంది. 10 జట్లు టోర్నీలోని 48 మ్యాచ్‌లను ఇవే బెయిల్స్‌తో ఆడుతాయి. ఈ జింగ్ బెయిల్స్ గత నాలుగేళ్లుగా ఉపయోగిస్తున్నాం. 2015 ప్రపంచకప్‌తో సహా.. అన్ని ఐసీసీ టోర్నీల్లో, డొమెస్టిక్ వేదికల్లో ఇవే బెయిల్స్ వాడాం. ఇప్పటికీ 1000 మ్యాచ్‌ల్లో ఈ బెయిల్స్ ఉపయోగించాం. ఈ బెయిల్స్ సమస్య ఆటలోని భాగమే.’ అని స్పష్టం చేస్తూ ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
చదవండి : బెయిల్స్ పడకపోవడం ఏంట్రా బాబు!
Comments
Please login to add a commentAdd a comment