నారీ... ధనాధన్‌ భేరి | ICC Womens T20 World Cup First Match India VS Australia | Sakshi
Sakshi News home page

నారీ... ధనాధన్‌ భేరి

Feb 21 2020 4:45 AM | Updated on Feb 24 2020 2:42 PM

ICC Womens T20 World Cup First Match India VS Australia - Sakshi

మహిళల క్రికెట్‌కు మళ్లీ ప్రపంచ కప్‌ కళ వచ్చింది. ఏడాది పాటు ఎన్ని టోర్నీలు, ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగినా ఆకర్షణలో విశ్వ సమరం తర్వాతే ఏదైనా! పొట్టి ఫార్మాట్‌లో తమ సత్తా చాటేందుకు అగ్రశ్రేణి ఆస్ట్రేలియా నుంచి ఆటలో తప్పటడగులు వేస్తున్న థాయ్‌లాండ్‌ వరకు 10 జట్లు సన్నద్ధమయ్యాయి. తొలి నాలుగు టి20 ప్రపంచ కప్‌లు పురుషుల టోర్నీలతో సమాంతరంగా జరగడంతో స్త్రీ శక్తికి రావాల్సిన గుర్తింపు దక్కలేదు. రెండేళ్ల క్రితం విడిగా నిర్వహించినా తగినంత ప్రచారం లభించలేదు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతుండటంతో ఒక్కసారిగా టోర్నీకు ఊపు వచ్చేసింది. ఇక 17 రోజుల పాటు నారీమణుల బ్యాట్‌ల నుంచి గర్జనలు ఖాయం.

టి20ల్లో ఆరు సార్లు ప్రపంచ కప్‌ జరిగితే నాలుగుసార్లు ఆస్ట్రేలియానే విజేతగా నిలిచింది. ఒకసారి వెస్టిండీస్‌ మహిళలు గెలుపు కిరీటం దక్కించుకోగా, మొదటి టోర్నీలో చాంపియన్‌ అయిన ఇంగ్లండ్‌ మళ్లీ ఆ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. మన భారత్‌ మాత్రం మూడుసార్లు సెమీఫైనల్‌ దశలోనే ఆగిపోయింది. ప్రతీసారి బలమైన పోటీదారుగా కనిపిస్తున్నా టైటిల్‌ మాత్రం న్యూజిలాండ్‌కు అందని ద్రాక్షే అయింది. ఈసారి కూడా సొంత గడ్డపై లేడీ కంగారూలు ఫేవరెట్‌లు అనడంలో సందేహం లేదు. పురుషుల క్రికెట్‌కు ఏమాత్రం తగ్గని రీతిలో ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్‌ మైదానంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన  మార్చి 8న జరిగే ఫైనల్లో తుది విజేత ఎవరో వేచి చూడాలి.

2009: తొలి టి20 ప్రపంచ కప్‌ జరిగిన ఏడాది. పురుషులతో పాటు వరుసగా నాలుగు టోర్నీలు జరిగాయి. 2018లో మాత్రం పురుషుల వరల్డ్‌ కప్‌ జరగకపోగా, మహిళల ఈవెంట్‌ను విడిగా నిర్వహించారు. ఈసారి ఇదే ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియాలోనే పురుషుల ప్రపంచ కప్‌ ఉన్నా... మహిళల టోర్నీ ప్రత్యేకత నిలబెట్టేందుకు, ప్రేక్షకుల, ప్రసారకర్తల దృష్టి మళ్లకుండా ఉండేందుకు ముందుగానే నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఐసీసీ పెద్ద మొత్తంలోనే ఖర్చు చేసింది.

‘ఉమెన్‌ ఇన్‌ బ్లూ’ ఆశలు!  
విశ్వ వేదికపై ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయినా... మళ్లీ పొట్టి ప్రపంచ కప్‌లో భారత్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఆరు టి20 వరల్డ్‌ కప్‌లలో ఒక్కసారి కూడా మన జట్టు తుది పోరుకు అర్హత సాధించలేకపోయింది. మూడుసార్లు సెమీస్‌లోనే ప్రస్థానం ముగిసింది. గతంతో పోలిస్తే ఈసారి మన టీమ్‌ కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. సరిగ్గా చెప్పాలంటే ఫార్మాట్‌కు తగిన విధంగా దూకుడు పెరిగింది. కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌ మార్గనిర్దేశనంలో అమ్మాయిలు మరింతగా రాటుదేలారు. గత టోర్నీలాగే ఇప్పుడూ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోనే జట్టు బరిలోకి దిగుతోంది. ఆతిథ్య జట్టు, డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా, మాజీ చాంపియన్‌ ఇంగ్లండ్‌లతో పోలిస్తే ఇంకా కొంత వెనుకబడినట్లు అనిపిస్తున్నా... ఈ ఫార్మాట్‌లో సంచలనానికీ అవకాశం ఉంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి శుభారంభం చేయాలని భారత్‌ పట్టుదలగా ఉంది.  ఫామ్‌ ప్రకారం చూస్తే 2019 నుంచి భారత్‌ 10 టి20లు మ్యాచ్‌లు గెలిచి మరో 10 ఓడింది. ఇది కాస్త నిలకడలేమిని చూపిస్తోంది. ఇటీవల జరిగిన ముక్కోణపు టోర్నీలోనూ ఇది కనిపించింది.

2018 నుంచి చూస్తే స్మృతి మంధాన అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌వుమన్‌గా నిలిచింది. 42 ఇన్నింగ్స్‌లలో ఆమె 1,243 పరుగులు చేసింది. స్ట్రయిక్‌ రేట్‌ కూడా దాదాపు 130 ఉంది. బిగ్‌బాష్‌ లీగ్‌లోనూ ఆడిన అనుభవం ఉన్న స్మృతి ఇచ్చే ఆరంభంపైనే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మూడో స్థానంలో ఉన్న కెప్టెన్‌ హర్మన్‌ కూడా 933 పరుగులు సాధించింది. వీరిద్దరి బ్యాటింగ్, అనుభవం జట్టుకు పెద్ద బలం. ఇక జెమీమా రోడ్రిగ్స్, ఇటీవల సంచలన బ్యాటింగ్‌ ప్రదర్శన కనబరుస్తున్న షఫాలీ వర్మ కూడా దూకుడుగా ఆడితే భారత్‌కు బ్యాటింగ్‌లో తిరుగుండదు. భారీ షాట్లు ఆడగల వేద కృష్ణమూర్తి తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఈ ఫార్మాట్‌లో ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ కూడా కీలకం కానుంది. పేస్‌ బౌలింగ్‌లో శిఖా పాండే ఓవరాల్‌ రికార్డు గొప్పగా లేకపోయినా... ఇటీవల పునరాగమనం తర్వాత ఆమె చాలా మెరుగ్గా ఆడుతోంది. అన్నింటికి మించి స్పిన్‌ బలగంపై కూడా భారత్‌ నమ్మకం పెట్టుకుంది. భిన్నమైన శైలి గల పూనమ్‌ యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్‌ల ప్రదర్శన జట్టు గెలుపోటములను ప్రభావితం చేయవచ్చు.

అంచనా... 
జట్టు కూర్పు, ఫామ్, కీలక ఆటగాళ్ల రికార్డులను బట్టి చూస్తే కనీసం ఫైనల్‌ చేరాల్సిందే. అంతకంటే తక్కువ ఫలితాన్ని సాధిస్తే అది ఏ రకమైన ఘనతా అనిపించుకోదు. ఇంతకంటే మెరుగైన అవకాశం కూడా మళ్లీ రాకపోవచ్చు. ఇక తుది పోరులో కూడా గెలవగలిగితే చరిత్ర సృష్టించినట్లే.

జట్టు వివరాలు 
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, రిచా ఘోష్, తానియా, పూనమ్‌ యాదవ్, రాధ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, పూజ, అరుంధతి రెడ్డి.

ఎవరికెంత ప్రైజ్‌మనీ... 
విజేత: 10 లక్షల డాలర్లు (రూ. 7 కోట్ల 18 లక్షలు) 
రన్నరప్‌: 5 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 59 లక్షలు)  
సెమీఫైనల్స్‌లో ఓడిన రెండు జట్లకు: 2 లక్షల 10 వేల డాలర్ల చొప్పున (రూ. కోటీ 50 లక్షలు) 
గ్రూప్‌ మ్యాచ్‌లో ఒక్కో విజయానికి: 15 వేల డాలర్ల చొప్పున (రూ. 10 లక్షల 77 వేలు) 
గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన ఆరు జట్లకు: 30 వేల డాలర్ల చొప్పున (రూ. 21 లక్షల 54 వేలు) 

►టోర్నీలో భారత్‌ మూడు సార్లు 2009, 2010, 2018లలో సెమీఫైనల్‌ వరకు చేరగలిగింది. ఒక్కసారి కూడా ఫైనల్లోకి అడుగు పెట్టలేదు.  
►వరుసగా ఏడో వరల్డ్‌ కప్‌ బరిలోకి దిగుతున్న అమ్మాయిలు 9 జట్లలో కలిపి 14 మంది ఉన్నారు. థాయ్‌లాండ్‌కు మాత్రం ఇదే తొలి వరల్డ్‌ కప్‌. 
►ఫైనల్‌ జరిగే మెల్‌బోర్న్‌ ఎంసీజీ మైదానం సామర్థ్యం. తుది పోరుకు స్టేడియం నిండితే ఒక అంతర్జాతీయ మహిళల మ్యాచ్‌కు అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరైన రికార్డు నమోదవుతుంది. అమెరికాలోని రోజ్‌బౌల్‌లో జరిగిన 1999 మహిళల ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు 90, 185 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు.  

టీవీ అంపైర్‌ ‘నోబాల్స్‌’ను పర్యవేక్షించనున్న తొలి ఐసీసీ టోర్నీ ఇదే  
గత విజేతలు
2009: ఇంగ్లండ్‌ 
2010, 2012, 2014, 2018: ఆస్ట్రేలియా
2016: వెస్టిండీస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement