భారత క్రికెటర్లకు చిత్రమైన పరిస్థితి | In IPl indian cricketers are suffering with prize money | Sakshi
Sakshi News home page

భారత క్రికెటర్లకు చిత్రమైన పరిస్థితి

Published Fri, Sep 6 2013 1:26 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM

భారత క్రికెటర్లకు చిత్రమైన పరిస్థితి

భారత క్రికెటర్లకు చిత్రమైన పరిస్థితి

గంభీర్‌కు ఐదు కోట్లు... జడేజాకు నాలుగు కోట్లు... యూసుఫ్ పఠాన్‌కు నాలుగు కోట్లు.... ఇవన్నీ వీళ్లకు ఏదో ఒక జట్టు చెల్లిస్తున్న మొత్తం కాదు. డాలర్ రేటు పెరగడంతో వీళ్లు నష్టపోతున్న మొత్తం!  డాలర్ రేటు రూ.66కి పెరిగినా... ఐపీఎల్ ఒప్పందం ప్రకారం భారత క్రికెటర్లకు రూ. 46 ప్రకారమే ఫ్రాంఛైజీలు డబ్బు చెల్లిస్తున్నాయి.
 
 సాక్షి క్రీడావిభాగం
 ఐపీఎల్ 2010 వేలంలో మూడేళ్ల కాలానికి గాను గంభీర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ 2.4 మిలియన్ డాలర్లకు కొనుక్కుంది. అప్పటి డాలర్ రేటు రూ. 46. దాని ప్రకారం గంభీర్‌కు ఏడాదికి కోల్‌కతా జట్టు రూ. 11.04 కోట్లు చెల్లించాలి. ఇప్పుడు డాలర్ రేట్ అనూహ్యంగా రూ.66కి పెరిగింది. దీని ప్రకారం గంభీర్‌కు రూ. 15.84 కోట్లు రావాలి. అంటే డాలర్ రేటు పెరగడం వల్ల గంభీర్‌కు వచ్చే లాభం... 4.8 కోట్లు. కానీ... వేలం డాలర్లలో జరిగినా గంభీర్‌కు ఆ రూపంలో మాత్రం ఇవ్వరు.
 
  రూపాయల్లోనే చెల్లిస్తారు. అది కూడా పాత రేటు రూ.46 ప్రకారమే. ఐపీఎల్ ఒప్పందం ప్రకారం భారత క్రికెటర్లకు మారకం రేటుతో సంబంధం లేకుండా అప్పటిరేటు ఒక్క డాలరుకు రూ. 46 మాత్రమే చెల్లిస్తారు. కాబట్టి ఇప్పుడు రేటు రూ. 66 ఉన్నా గంభీర్‌కు మాత్రం రూ. 11.04 కోట్లు మాత్రమే వస్తాయి. మొత్తం భారత క్రికెటర్లందరిదీ ఇదే పరిస్థితి.
 
 అయితే ఈ విషయంలో విదేశీ ఆటగాళ్లు జాక్‌పాట్ కొట్టారనే అనుకోవాలి. వారికి డాలర్లు చెల్లించాలనే ఒప్పందం ఉంది. అంటే వీరికి రూ. 46 అనే కండిషన్ లేదు. కాబట్టి ఇప్పటి రేటు ప్రకారమే చెల్లింపులు జరుపుతారు. ఉదాహరణకు ముంబై జట్టు ఆటగాడు మ్యాక్స్‌వెల్ వేలం ధర మిలియన్ డాలర్లు. భారత ఆటగాళ్లకు ఉన్న షరతులే ఉంటే... మ్యాక్స్‌వెల్‌కు రూ. 4.6 కోట్లు దక్కేవి. కానీ డాలర్లలో అతడికి డబ్బు వస్తుంది. కాబట్టి తనకు ఇప్పుడు రూ.6.6 కోట్లు వస్తున్నాయి. అంటే మారక రేటులో మార్పుల వల్ల మ్యాక్స్‌వెల్ ఏకంగా రూ. 2 కోట్లు అదనంగా పొందుతున్నాడు.
 
 భారత స్టార్ ఆల్‌రౌండర్ జడేజా రేటు 2 మిలియన్ డాలర్లు. అంటే అతడికి చెల్లించేది రూ. 9.2 కోట్లు. మ్యాక్స్‌వెల్ రేటు జడేజాలో సగమే. కానీ మ్యాక్స్‌వెల్‌కు వస్తోంది 6.6 కోట్లు. అంటే తేడా కేవలం రూ. 2.6 కోట్లు మాత్రమే అంటే వేలంలో రెట్టింపు ధర పలికినా... వాస్తవంలో మాత్రం తక్కువే వస్తుంది.  మొత్తం మీద డాలర్ రేటు మారినా పాత రేటు ప్రకారం భారత క్రికెటర్లు చెల్లింపులు పొందుతున్నారు. దీనివల్ల సుమారు 40 శాతం అదనంగా రావలసిన మొత్తాన్ని కోల్పోతున్నారు. ఇదే సమయంలో విదేశీ ఆటగాళ్లకు సుమారు 40 శాతం అదనపు ప్రతిఫలం దక్కుతోంది.
 
 ఫ్రాంఛైజీల పరిస్థితి?
 భారత ఆటగాళ్ల విషయంలో డాలర్ రేటు వర్తించకపోవడం వల్ల ఊపిరి పీల్చుకున్నా... ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు విదేశీ ఆటగాళ్ల చెల్లింపులు, విదేశీ మద్దతు సిబ్బంది చెల్లింపుల విషయంలో మాత్రం తలనొప్పి తప్పడం లేదు. డాలర్‌కు రూపాయి విలువ ఒక్క రూపాయి పెరిగితే ఒక్కో ఫ్రాంఛైజీ ఖర్చు సగటున 15 లక్షల రూపాయలు  పెరుగుతుంది. కానీ ఇందులో కాస్త ఊరట ఏమిటంటే.. చెల్లింపులన్నీ ఒకే సమయంలో ఉండకపోవడం.
 
  నిబంధనల ప్రకారం... ప్రతి సీజన్‌లో ఫ్రాంఛైజీలు ఆటగాళ్లకు ఐపీఎల్ ఆరంభానికి ముందు 15 శాతం, మే 1 నాటికి మరో 50 శాతం చెల్లించాలి. మిగిలిన 35 శాతం నవంబర్ 1 లోగా చెల్లించాలి. అంటే ఒకరంగా మే 1 నాటికి 65 శాతం చెల్లించిన వారు డాలర్‌కు రూ.54 చొప్పున చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని ప్రస్తుత రేటులో చెల్లిస్తారు. ఆటగాళ్లకు చెల్లింపులను ఆలస్యం చేసిన బెంగళూరు లాంటి ఫ్రాంఛైజీలకు ఇది మరింత తలనొప్పి.
 
 ఇకపై వేలం రూపాయల్లోనే...
 ఈ దెబ్బను తట్టుకోలేక వచ్చే సీజన్ వేలాన్ని ఐపీఎల్ రూపాయల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనివల్ల ఈ మారక రేటు గొడవ లేకుండా ఆటగాళ్లకు వాళ్లకు రావలసిన పూర్తి మొత్తం వస్తుంది. మరోవైపు ఫ్రాంఛైజీల ఆర్థిక ప్రణాళికలు దెబ్బతినకుండా ఉంటాయి. భారత క్రికెటర్లు కూడా ఇదే కోరుకుంటున్నారు. ‘రేటులో మార్పు వల్ల మేం నష్టపోతున్న మాట వాస్తవమే. అయితే ఐపీఎల్ ద్వారా భారీ మొత్తం వస్తున్నందున ఎవరిలోనూ పెద్దగా ఈ విషయంపై అసంతృప్తి లేదు. ఏమైనా వేలం రూపాయల్లో జరగడాన్ని మేం స్వాగతిస్తున్నాం’ అని ఒక భారత క్రికెటర్ అన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement