శ్రీలంక పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్లకు సంబంధించి అభిమానుల్లో నెలకొని ఉన్న పలు అనుమానాలను సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ఇవాళ (జులై 22) నివృత్తి చేశాడు. టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన అగార్కర్.. లంక పర్యటన కోసం కొందరు ఆటగాళ్లను పరిగణలోకి తీసుకోకపోవడానికి గల కారణాలను వెల్లడించాడు.
ఫిట్‌నెస్ కారణంగా హార్దిక్ పాండ్యాకు టీ20 కెప్టెన్సీ అప్పగించలేదని చెప్పిన అగార్కర్.. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను వన్డే జట్టు నుంచి తప్పించలేదని వివరణ ఇచ్చాడు. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా జడ్డూకు విశ్రాంతి కల్పించినట్లు తెలిపాడు. ఒకవేళ అక్షర్‌తో పాటు జడేజాను కూడా ఎంపిక చేసినా.. తుది జట్టులో ఒక్కరికే అవకాశం దక్కుతుందని తెలిపాడు.
టీమిండియా సమీప భవిష్యత్తులో చాలా టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటం జడ్డూకు విశ్రాంతినివ్వడానికి మరో కారణమని అన్నాడు. వన్డేల్లో జడ్డూ ఇప్పటికీ కీలక ఆటగాడేనని వివరణ ఇచ్చాడు. అగార్కర్-గంభీర్ ప్రెస్ మీట్‌లో హార్దిక్, జడ్డూ అంశాలతో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలు ప్రస్తావనకు వచ్చాయి.
టీ20 వరల్డ్‌కప్ అనంతరం టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లిలకు 2027 వన్డే వరల్డ్‌కప్ ఆడగలే సత్తా ఉందని గంభీర్, అగార్కర్ అభిప్రాయపడ్డారు.
కోహ్లితో తన మంచి సత్సంబంధాలు ఉన్నాయని గంభీర్ వివరణ ఇచ్చాడు.
శుభ్‌మన్ గిల్ మూడు ఫార్మాట్ల ప్లేయర్ అని గంభీర్-అగార్కర్ ద్వయం అభిప్రాయపడింది.
షమీ స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌తో రీ ఎంట్రీ ఇస్తాడని గంభీర్-అగార్కర్ జోడీ ఆశాభావం వ్యక్తిం చేసింది.
రుతురాజ్, అభిషేక్ శర్మలను ఎంపిక చేయకపోవడంపై స్పందిస్తూ.. బాగా ఆడినా కొన్ని సార్లు అందరికీ అవకాశం ఇవ్వలేమని అగార్కర్ తెలిపాడు.
హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వకపోయినా ఇప్పటికీ అతను కీలక ఆటగాడని గంభీర్ అన్నాడు.
కాగా, గంభీర్-అగార్కర్ ప్రెస్ మీట్ అనంతరం భారత బృందం శ్రీలంక పర్యటనకు బయల్దేరింది. శ్రీలంకతో టీ20 సిరీస్ జులై 27న మొదలవుతుంది. 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment