మొహాలీలోనూ మెరిసేనా! | In Mohali stadium also india will beat Australia! | Sakshi
Sakshi News home page

మొహాలీలోనూ మెరిసేనా!

Published Sat, Oct 19 2013 12:49 AM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM

మొహాలీలోనూ మెరిసేనా!

మొహాలీలోనూ మెరిసేనా!

మధ్యాహ్నం 1.30 గంటల నుంచి
 స్టార్ క్రికెట్‌లో ప్రత్యక్ష ప్రసారం
 
 మొహాలీ: రెండో వన్డేలో దుస్సాధ్యమైన లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన భారత జట్టు అంతులేని ఆత్మవిశ్వాసంతో మరో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు (శనివారం) పంజాబ్ క్రికెట్ స్టేడియం (పీసీఏ)లో ఇరు జట్ల మధ్య మూడో వన్డే జరుగుతుంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే రెండో అత్యుత్తమ ఛేజింగ్‌తో రికార్డుకెక్కిన భారత ఆటగాళ్ల నుంచి నేటి వన్డేలోనూ అలాంటి ప్రదర్శనే కనబరచాలని అభిమానులు ఆశిస్తున్నారు. జైపూర్ వన్డేలో 360 పరుగులను శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కలిసి కేవలం 44 ఓవర్లలోనే ఛేదించడంతో ఆస్ట్రేలియా జట్టుకు దిమ్మ తిరిగింది.
 
 ఓ రకంగా తమ ముందు ఎంత లక్ష్యముంచినా ప్రత్యర్థి ప్రశాంతంగా ఉండలేడని ఈ త్రయం నిరూపించింది. తొలి మ్యాచ్‌లో 300కు పైగా టార్గెట్‌ను అందుకోలేకపోయిన భారత జట్టు రెండో వన్డేలో మాత్రం తమ చాంపియన్ ఆటతీరును ప్రదర్శించింది. కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి అతి భారీ స్కోరును అందుకున్న తీరు అమోఘం. అటు ఆసీస్ పటిష్ట భారత్‌ను ఎలా ఎదుర్కోవాలో ప్రణాళికలు రచిస్తోంది. కచ్చితంగా ఈ వన్డేలో నెగ్గి ఆధిపత్యం సాధించాలని చూస్తోంది. మరోవైపు పీసీఏ పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండడంతో మరోసారి అభిమానులకు పరుగుల విందు ఖాయం కానుంది.
 
 బ్యాటింగే బలం
 దుర్భేద్యమైన బ్యాటింగ్ ఆర్డర్ భారత జట్టుకు పెట్టని కోటలా ఉంది. ఓపెనర్లు ధావన్, రోహిత్ చెలరేగి శుభారంభాన్ని అందిస్తుండగా వన్‌డౌన్‌లో కోహ్లి సంచలన ఆటతీరుతో పరుగుల వరద పారిస్తున్నాడు. ఆ తర్వాత రైనా, ఫామ్‌లో ఉన్న యువరాజ్, కెప్టెన్ ధోని, జడేజా తమ బ్యాట్లకు పని చెబితే ప్రత్యర్థి బౌలర్లు చేష్టలుడిగి పోవాల్సిందే. ఈ విషయం ఆసీస్ కెప్టెన్ బెయిలీకి కూడా బాగానే తెలుసు. అందుకే వన్డే ఫార్మాట్‌లో భారత్ టాప్-7 ఆటగాళ్లు అత్యద్భుతమని కితాబిచ్చాడు. ధావన్ తన తొలి టెస్టులోనే సెంచరీతో అదరగొట్టింది ఈ స్టేడియంలోనే కావడం అతడికి కలిసొచ్చే అంశం. యువరాజ్‌కు ఓరకంగా ఇది సొంత మైదానమే. రైనా, జడేజాలకు రెండో వన్డేలో అవకాశం రాకపోయినప్పటికీ భారీ స్కోర్లు సాధించాల్సి ఉంది.
 
 ప్రస్తుతం జట్టును ఆందోళన పరిచే విషయం ఒక్క బౌలింగ్ విభాగంలోనే. ఇప్పటిదాకా జరిగిన రెండు వన్డేలు, ఓ టి20 కలుపుకుంటే మొత్తం 864 పరుగులను సమర్పించుకున్నారు. ఓవర్‌కు 7.20 చొప్పున పరుగులు ఇవ్వడం ఆందోళనపరిచే అంశం. ఒక్క భువనేశ్వర్ మినహా ఒక్కరు కూడా ఆసీస్‌ను ఇబ్బంది పెట్టడం లేదు. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ రెండు వన్డేల్లో ఓవర్‌కు ఎనిమిది పరుగుల దాకా ఇచ్చాడు. స్పిన్నర్ అశ్విన్ పూర్తిగా విఫలమవుతున్నాడు. దీంతో వినయ్, ఇషాంత్‌లలో ఒకరికి ఉద్వాసన తప్పకపోవచ్చు.
 
 ఒత్తిడిలో ఆసీస్
 తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన ఊపులో రెండో వన్డే ఆడిన ఆసీస్‌కు భారత జట్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. దీంతో ఆతిథ్య జట్టును ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని పరిస్థితిలో పడింది. అయితే వీరి బ్యాటింగ్ ఆర్డర్ కూడా మంచి ఫామ్‌లో ఉండడం అనుకూలాంశం. ఓపెనర్లు  ఫించ్, హ్యూస్ జట్టుకు శుభారంభాన్నిస్తున్నారు. బెయిలీ ఈ సిరీస్‌లో బాగా ఆడుతున్నాడు. అటు వాట్సన్ కూడా ఫామ్‌లోకొచ్చాడు. ఇక చివర్లో మ్యాక్స్‌వెల్ రెచ్చిపోతున్నాడు. అటు బౌలింగ్ పరంగానూ భారత్‌తో పోలిస్తే మెరుగనే చెప్పుకోవచ్చు. జాన్సన్, ఫాల్క్‌నర్, మెక్‌కే రూపంలో మంచి పేసర్లున్నారు. సమష్టిగా రాణించి ఈ వన్డేలో ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్ భావిస్తోంది.
 
 జట్లు: (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రోహిత్, కోహ్లి, రైనా, యువరాజ్, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, వినయ్, ఇషాంత్/ఉనాద్కట్. ఆస్ట్రేలియా: బెయిలీ (కెప్టెన్), ఫించ్, హ్యూస్, వాట్సన్, మ్యాక్స్‌వెల్, హాడిన్, జాన్సన్, మెక్‌కే, వోజెస్, డోహర్తి, ఫాల్క్‌నర్.
 
 వాతావరణం
 మ్యాచ్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం లేదు. పూర్తిగా ఎండ కాయనుంది.
 
 పిచ్
 జైపూర్ పిచ్ తరహాలోనే ఇక్కడ కూడా బ్యాటింగ్‌కు అనుకూలించనుంది.
 
 మంచు కీలకం...
 ‘మొహాలీతో నాకు గొప్ప అనుబంధం ఉంది. ఇక్కడే తొలి టెస్టు సెంచరీ సాధించాను. ఇక్కడ పేసర్లకు, బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది. అలాగే మంచు కూడా కీలకం కానుంది’
 - శిఖర్ ధావన్ (భారత్ ఓపెనర్)
 
 ‘మా బౌలర్లపై నమ్మకముంది’
 ‘రెండో వన్డేలో 360 పరుగుల లక్ష్యాన్ని భారత్ సులువుగా ఛేదించడం ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. అయితే మా బౌలర్లను తప్పుపట్టాల్సిన పనిలేదు. వారిపై నాకు నమ్మకం ఉంది. మూడో వన్డేలోనూ షేన్ వాట్సన్‌ను వన్‌డౌన్‌లోనే బరిలోకి దించుతాం.’
 - జార్జి బెయిలీ (ఆసీస్ కెప్టెన్)
 
 0 మొహాలీలో ఇప్పటిదాకా ఒక్క భారత బ్యాట్స్‌మన్ కూడా సెంచరీ చేయలేదు
 
 99 ఈ వేదికపై 2007లో సచిన్ చేసిన 99 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు
 
 2 భారత్‌తో ఇక్కడ ఆడిన మూడు వన్డేల్లో ఆసీస్ రెండు నెగ్గింది
 
 5 ఈ మైదానంలో ఐదు సార్లు 300కు పైగా పరుగులు వచ్చాయి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement