కోల్ కతా: భారత్ లో ఫుట్ బాల్ పూర్వ వైభవం దిశగా పయనిస్తోందని ఢిల్లీ డైనమోస్ స్టార్ స్ట్రయికర్ రాబిన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. భారత్ లో ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) ప్రవేశపెట్టిన అనంతరం దేశ ఫుట్ బాల్ కు మంచి రోజులు వచ్చాయన్నాడు. భారత్ లో ఫుట్ బాల్ కు రోజు రోజుకూ ఆదరణ పెరగడానికి ఐఎస్ఎల్ ఎంతగానో ఉపయోగపడిందన్నాడు. రానున్న రోజుల్లో భారత్ ఫుట్ బాల్ మరింత శక్తివంతంగా రూపాంతరం చెందుతుందన్నాడు. ఢిల్లీ జట్టుకు ఆటగాడిగా, కోచ్ గా సేవలందిస్తున్న బ్రెజిల్ స్టార్ రాబర్టో కార్లోస్ పై రాబిన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
ఓ మేటి ఆటగాడితో కలిసి పని చేయడం చాలా ఆహ్లాదంగా ఉందన్నాడు. అతని నేతృత్వంలో పని చేయడంతో యూరోపియన్ ఫుట్ బాల్ గురించి అనేక విషయాలను తెలుసుకునే ఆస్కారం భారత ఆటగాళ్లకు దక్కుతుందన్నాడు. ప్రస్తుతం ఢిల్లీ జట్టలో అనేక మంది కీలక ఆటగాళ్లతో నిండివుందని రాబిన్ పేర్కొన్నాడు. తొలి ఐఎస్ఎల్ సీజన్ కు దూరంగా ఉన్న రాబిన్.. రెండో ఎడిషన్ లో ఢిల్లీ డైనోమోస్ తరపున బరిలోకి దిగాడు. ఇప్పటి వరకూ ఐదు గేమ్ లు ఆడిన రాబిన్ కేవలం ఒక గోల్ మాత్రమే నమోదు చేశాడు.