బెంగళూరు: తనకు అచ్చొచ్చిన మైదానంలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 9000 పరుగులు పూర్తిచేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా రోహిత్ (217) రికార్డు అందుకున్నాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లి (194), ఏబీ డివిలియర్స్(208) తర్వాత అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే రోహిత్ ఈ మార్క్ అందుకున్నాడు. రోహిత్ తర్వాత గంగూలీ (228), సచిన్ టెండూల్కర్ (235), లారా (239)లు వరుసగా ఉన్నారు.
ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్ కమిన్స్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికి రెండు పరుగులు సాధించడంతో హిట్ మ్యాన్ 9000 పరుగుల క్లబ్‌లో చేరాడు. ఇక చిన్నస్వామి స్టేడియంకు రోహిత్‌కు ఎంత ప్రత్యేకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదే మైదానంలో 2013లో ఆసీస్‌పై డబుల్ సెంచరీ(209) సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇదే మ్యాచ్‌లో ఆడం జంపా వికెట్ పడగొట్టడంతో మహ్మద్ షమీ వన్డేల్లో 200 వికెట్ల క్లబ్‌లో చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment