విరాట్‌ కోహ్లి మరో ఘనత | Ind Vs Ban: Kohli Surpasses Boarder's Record List Of Most Test Wins As Captain | Sakshi

విరాట్‌ కోహ్లి మరో ఘనత

Nov 24 2019 3:22 PM | Updated on Nov 24 2019 3:24 PM

Ind Vs Ban: Kohli Surpasses Boarder's Record List Of Most Test Wins As Captain - Sakshi

కోల్‌కతా: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అరుదైన జాబితాలో చేరిపోయాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో గెలుపు తర్వాత అత్యధిక టెస్టు విజయాలు సాధించి కెప్టెన్ల జాబితాలో కోహ్లి ఐదో స్థానాన్ని ఆక్రమించాడు. ఈ క్రమంలోనే ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు అలెన్‌ బోర్డర్‌ రికార్డును కోహ్లి బ్రేక్‌ చేశాడు. కెప్టెన్‌గా కోహ్లికిది 33వ టెస్టు విజయం. ఈ జాబితాలో గ్రేమ్‌ స్మిత్‌(దక్షిణాఫ్రికా-53 విజయాలు) అగ్రస్థానంలో ఉండగా, రికీ పాంటింగ్‌(ఆసీస్‌-48 విజయాలు) రెండో స్ఠానంలో ఉన్నాడు.

మరో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ వా 41 విజయాలతో మూడో స్థానంలో ఉండగా, వెస్టిండీస్‌ మాజీ సారథి క్లైవ్‌ లాయిడ్‌ 36 విజయాలతో నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానంలో కోహ్లి నిలిచాడు. అత్యధిక టెస్టు విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన కోహ్లి.. బోర్డర్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. ఒక కెప్టెన్‌గా బోర్డర్‌ 32 టెస్టు విజయాల్ని ఖాతాలో వేసుకున్నాడు.

బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులోనే కోహ్లి కెప్టెన్‌గా ఐదు వేల పరుగుల్ని వేగవంతంగా సాధించిన రికార్డును నమోదు చేయగా, పింక్‌ బాల్‌ టెస్టులో సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్లలో 41 సెంచరీలను సాధించి పాంటింగ్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆటగాడిగా కోహ్లి 70 శతకాలు నమోదు చేశాడు. టెస్టుల్లో 27 సెంచరీలు, వన్డేల్లో 43 సెంచరీలు కోహ్లి ఖాతాలో ఉన్నాయి. టెస్టుల్లో కెప్టెన్‌గా 20వ  శతకం సాధించడంతో గ్రేమ్‌ స్మిత్‌ తర్వాత స్థానంలో కోహ్లి నిలిచాడు. టెస్టు కెప్టెన్‌గా గ్రేమ్‌ స్మిత్‌ 25 శతకాలు సాధించగా, ఆ తర్వాత స్థానంలో కోహ్లి ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement