పంత్‌.. నీ కీపింగ్‌ ఏంది?: తలపట్టుకున్న రోహిత్‌ | Ind Vs Ban: Pant's DRS Gaffe Gets Comical Reaction From Rohit | Sakshi
Sakshi News home page

పంత్‌.. నీ కీపింగ్‌ ఏంది?: తలపట్టుకున్న రోహిత్‌

Published Mon, Nov 4 2019 12:14 PM | Last Updated on Mon, Nov 4 2019 12:19 PM

Ind Vs Ban: Pant's DRS Gaffe Gets Comical Reaction From Rohit - Sakshi

ఢిల్లీ: టీమిండియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు చేసిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్‌ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ముష్ఫికర్‌ రహీమ్‌ (43 బంతుల్లో 60 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, వికెట్‌ కీపర్‌ పాత్రలో రిషభ్‌ పంత్‌ మరొకసారి విఫలయ్యాడు. ప్రధానంగా డీఆర్‌ఎస్‌ల విషయంలో చురుగ్గా ఉండే ఎంఎస్‌ ధోని స్థానాన్ని పంత్‌ భర్తీ చేయలేడనే విషయం మరోసారి రుజువైంది.

వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్‌ వేసిన 10వ ఓవర్‌లో సౌమ్య సర్కార్‌ క్రీజులో ఉన్నాడు. చహల్‌ వేసిన బంతి సౌమ్య బ్యాట్‌కు తాకీతాకనట్టు వెళ్లి నేరుగా పంత్‌ చేతుల్లో పడింది. భారత ఆటగాళ్లు అందరూ అప్పీల్ చేసినా.. అంపైర్‌ ఔట్ ఇవ్వలేదు. అంపైర్‌ ఔట్‌ ఇవ్వకపోవడంతో  బౌలర్‌ చహల్‌కు పూర్తి స్పష్టత లేదు. కెప్టెన్ రోహిత్‌ శర్మ చహల్‌ను అడగ్గా స్పష్టంగా చెప్పలేను అని సమాధానం ఇచ్చాడు.  కీపర్ పంత్‌ను అడగ్గా.. కచ్చితంగా బ్యాట్‌కు బంతి తగిలింది అని చెప్పి రోహిత్‌ను ఒప్పించి డీఆర్‌ఎస్‌ కోరాడు. సమీక్షలో సౌమ్య బ్యాట్‌కు బంతి తగలలేదని స్పష్టంగా తేలడంతో టీమిండియా డీఆర్‌ఎస్‌ వృథా అయ్యింది. దీనిపై రోహిత్‌ శర్మ తలపట్టుకున్నాడు. ‘ పంత్‌.. నీ కీపింగ్‌ ఏంది.. నువ్వు ఏంది’ అని అర్థం వచ్చేలా రోహిత్‌ నవ్వుకుంటూ తలకొట్టుకున్నాడు. ఈ విషయంపై పంత్‌ ఏదో చెప్పబోయే యత్నం చేసినా డీఆర్‌ఎస్‌ వృథా కావడం మాత్రం రోహిత్‌లో అసంతృప్తిని బయటపెట్టింది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

అంతకుముందు కూడా పంత్‌ మరో అవకాశాన్ని వదిలేశాడు. ముష్ఫికర్‌ రహీమ్‌ కుదురుకోకముందే ఎల్బీగా ఔట్ అయినా.. ఆ అవకాశాలను పంత్‌ వాటిని పసిగట్టడంలో విఫలమయ్యాడు. ఎల్బీగా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ముఫ్ఫికర్‌ (60నాటౌట్‌) అద్భుతంగా పోరాడి బంగ్లాదేశ్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు.  కాగా, మ్యాచ్‌ తర్వాత రోహిత్‌ శర్మ డీఆర్‌ఎస్‌లో తప్పిదాలు గురించి మాట్లాడాడు. ‘ మేము డీఆర్‌ఎస్‌లో తప్పిదాలు చేయడం కూడా మ్యాచ్‌లో ఓటమికి ఒక కారణంగా చెప్పుకొచ్చాడు. ఇక నెటిజన్లు అయితే రిషభ్‌ పంత్‌ కీపింగ్‌ను ఏకిపారేస్తున్నారు. ఏదో పేరుకు మాత్రమే కీపర్‌గా ఉండటం తప్పితే అతని వల్ల పెద్దగా ఉపయోగం ఏమీ లేదంటూ మండిపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement