Ind vs Ban: టీమిండియాదే విజయం.. రికార్డులే సాక్ష్యం! | Ind vs Ban 1st Test 2024: Bangladesh Target 515 Runs, Highest-Ever In Chepauk | Sakshi
Sakshi News home page

భారీ లక్ష్యం.. బంగ్లాదేశ్‌ ఒక్కటీ గెలవలేదు!.. టీమిండియాదే విజయం?

Published Sat, Sep 21 2024 2:13 PM | Last Updated on Sat, Sep 21 2024 3:25 PM

Ind vs Ban 1st Test 2024: Bangladesh Target 515 Runs, Highest-Ever In Chepauk

గిల్‌, పంత్‌ (PC: BCCI X)

పాకిస్తాన్‌ను సొంతగడ్డపై మట్టికరిపించి 2-0తో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన బంగ్లాదేశ్‌ జట్టు.. అదే జోరులో భారత్‌లో అడుగుపెట్టింది. పటిష్ట టీమిండియాను పడగొట్టడం తేలికేమీ కాదని తెలిసినా.. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొంది. అయితే, తొలి టెస్టు తొలి రోజు ఆరంభంలో కాస్త పైచేయి సాధించినా.. తర్వాత సీన్‌ మొత్తం రివర్స్‌ అయ్యింది.

భారీ లక్ష్యం.. బంగ్లాదేశ్‌ ఒక్కటీ గెలవలేదు!.
గెలుపు సంగతి దేవుడెరుగు.. బంగ్లాదేశ్‌ ప్రస్తుతం భారీ ఓటమి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియని స్థితిలో నిలిచింది. అవును.. రెండు రోజుల ఆట మిగిలి ఉండవచ్చ. కానీ 515 పరుగులు సాధించడమైతే షాంటో బృందానికి అంత తేలికేమీ కాదు. గత రికార్డులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి.

ఇప్పటి వరకు టెస్టుల్లో 400 పరుగులకు పైగా లక్ష్యాన్ని(ఫోర్త్‌ ఇన్నింగ్స్‌) బంగ్లాదేశ్‌ ఇప్పటి వరకు ఎప్పుడూ ఛేదించనే లేదు. 20 సార్లు ఇంతంటి భారీ లక్ష్యం ముందు నిలిచిన బంగ్లా.. ఒక్కసారి మాత్రం మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. అయితే.. పందొమ్మిదిసార్లూ ఓటమినే చవిచూసింది. టీమిండియా బౌలర్ల జోరు చూస్తూ ఉంటే.. బంగ్లాదేశ్‌ ఖాతాలో 20వ పరాజయం కూడా చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

అప్పుడు అశ్విన్‌ సెంచరీ.. 
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్‌ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్‌ జరుగుతోంది. ఈ క్రమంలో చెన్నైలోని చెపాక్‌ వేదికగా గురువారం తొలి టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, ఆరంభంలో బంగ్లా పేసర్‌ హసన్‌ మహమూద్‌ ధాటి(5/83)కి ఇబ్బంది పడ్డ టీమిండియా.. రవిచంద్రన్‌ అశ్విన్‌(113) సూపర్‌ సెంచరీతో కోలుకుంది.

అశూతో పాటు ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ 56, మరో స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా 86 పరుగులతో రాణించారు. ఫలితంగా టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు స్కోరు చేసింది. అనంతరం.. బంగ్లాదేశ్‌ 149 పరుగులకే ఆలౌట్‌ అయింది. టీమిండియా పేసర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా 4, సిరాజ్‌ రెండు, ఆకాశ్‌ దీప్‌ రెండు వికెట్లు తీయగా.. స్పిన్నర్‌ జడ్డూ రెండు వికెట్లు పడగొట్టాడు.

ఇపుడు గిల్‌, పంత్‌ శతకాలు
ఈ క్రమంలో 227 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన టీమిండియాను శుబ్‌మన్‌ గిల్‌, రిషభ్‌ పంత్‌ మరింత పటిష్ట స్థితిలో నిలిపారు. గిల్‌(119 నాటౌట్‌), పంత్‌(109) అద్భుత శతకాలతో దుమ్ములేపారు. ఈ క్రమంలో 64 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 287 పరుగుల వద్ద ఉండగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టీమిండియా ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశాడు. 

దీంతో ఓవరాల్‌గా 514 పరుగుల లీడ్‌లో ఉన్న భారత్‌.. బంగ్లాదేశ్‌కు 515 పరుగుల టార్గెట్‌ విధించింది. అయితే, ఇంతటి లక్ష్యాన్ని ఛేదించాలంటే బంగ్లాదేశ్‌కు ఈజీ కాదు. ఏమో గుర్రం ఎగరావచ్చు అంటారా?! చూద్దాం.. ఇప్పటికైతే టీమిండియా విజయం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

టీమిండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ తొలి టెస్టు (సెప్టెంబరు 19- 23)
టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ స్కోరు: 376
బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు: 149
టీమిండియా రెండో ఇన్నింగ్స్‌- 287/4 డిక్లేర్డ్‌
బంగ్లాదేశ్‌ లక్ష్యం- 515 పరుగులు
చదవండి: AFG vs SA: వన్డేల్లో అఫ్గన్‌ సంచలన విజయం.. సౌతాఫ్రికాపై సిరీస్‌ గెలుపు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement