డకౌట్‌ని మరిపించి.. సెంచరీతో చెలరేగిన గిల్‌ | Ind vs Ban 1st Test Chennai 2024: Gill Super Century After Duck Out | Sakshi
Sakshi News home page

డకౌట్‌ని మరిపించి.. సెంచరీతో చెలరేగిన గిల్‌

Published Sat, Sep 21 2024 12:47 PM | Last Updated on Sat, Sep 21 2024 3:19 PM

Ind vs Ban 1st Test Chennai 2024: Gill Super Century After Duck Out

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దుమ్ములేపాడు. శనివారం నాటి మూడో రోజు ఆట భోజన విరామ సమయానికి 137 బంతులు ఎదుర్కొన్న గిల్‌.. 86 పరుగులు సాధించాడు.

రెండో ఇన్నింగ్స్‌లోనే ఇలా
బ్రేక్‌ తర్వాత తిరిగొచ్చి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా ఈ వన్‌డౌన్‌ బ్యాటర్‌ గత నాలుగు టెస్టుల్లో సెకండ్‌ ఇన్నింగ్స్‌లో మూడు అర్ధ శతకాలతో పాటు.. ఒక సెంచరీ సాధించాడు. తాజాగా మరోసారి రెండో ఇన్నింగ్స్‌లోనే శతకంతో సత్తా చాటడం విశేషం.  కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌లో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతోంది.

ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య చెన్నై వేదికగా గురువారం మొదటి టెస్టు ఆరంభమైంది. టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుని రోహిత్‌ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌట్‌ కాగా.. బంగ్లాదేశ్‌ 149 పరుగులకే కుప్పకూలింది. 

పంత్‌ కూడా శతకం బాదాడు
ఈ క్రమంలో 83/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియాకు గిల్‌, పంత్‌ శుభారంభం అందించారు. వీరిద్దరి శతకాల కారణంగా టీమిండియాకు ఏకంగా 514 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో గిల్‌.. 119 పరుగుల వద్ద ఉండగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టీమిండియా‌ రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశాడు. దీంతో బంగ్లాదేశ్‌కు భారత్‌ 515 పరుగుల లక్ష్యాన్ని విధించింది.

టీమిండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ తొలి టెస్టు (సెప్టెంబరు 19- 23)
టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ స్కోరు: 376
బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు: 149
టీమిండియా రెండో ఇన్నింగ్స్‌- 287/4 డిక్లేర్డ్‌
బంగ్లాదేశ్‌ లక్ష్యం- 515 పరుగులు

తుదిజట్లు:
టీమిండియా
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్‌ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.

బంగ్లాదేశ్‌
షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహీద్ రాణా.

చదవండి: చరిత్ర సృష్టించిన జైస్వాల్‌.. గావస్కర్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement