ఇరగదీసిన టీమిండియా | IND Vs NZ: Iyer, Rahul Shine As India Set Target Of 348 Runs | Sakshi
Sakshi News home page

ఇరగదీసిన టీమిండియా

Published Wed, Feb 5 2020 11:28 AM | Last Updated on Wed, Feb 5 2020 11:32 AM

IND Vs NZ: Iyer, Rahul Shine As India Set Target Of 348 Runs - Sakshi

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఊపుమీద ఉన్న టీమిండియా.. తొలి వన్డేలో సైతం ఇరగదీసింది. న్యూజిలాండ్‌ బౌలింగ్‌ను చీల్చిచెండాడి 348 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. శ్రేయస్‌ అయ్యర్‌(103; 107 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌), కేఎల్‌ రాహుల్‌(88 నాటౌట్‌; 64 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు), విరాట్‌ కోహ్లి(51; 63 బంతుల్లో 6 ఫోర్లు)లు రాణించడంతో భారత్‌ భారీ స్కోరును నమోదు చేసింది. టాస్‌ గెలిచిన కివీస్‌ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకోవడంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. భారత్‌ ఇన్నింగ్స్‌ను పృథ్వీషా, మయాంక్‌ అగర్వాల్‌లు ఆరంభించారు. ఈ మ్యాచ్‌ ద్వారా వీరిద్దరూ వన్డే అరంగేట్రం చేసినా ఆశించిన స్థాయిలో రాణించలేదు.

తొలి వికెట్‌కు 50 పరుగులు జత చేసిన తర్వాత పృథ్వీ షా(20; 21 బంతుల్లో 3 ఫోర్లు) ఔట్‌ కాగా, మరో నాలుగు పరుగుల వ్యవధిలో మయాంక్‌ అగర్వాల్‌ (32; 31 బంతుల్లో 6  ఫోర్లు) పెవిలియన్‌ చేరాడు. ఓపెనర్‌ పృథ్వీషా(20) ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి సమయోచితంగా బ్యాటింగ్‌ చేసి అర్థ శతకం నమోదు చేశాడు. 61 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్‌ సెంచరీ చేశాడు. శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి 102 పరుగుల భాగస్వామ్యాన్ని కోహ్లి నెలకొల్పాడు. ఈ క్రమంలోనే అర్థ శతకంతో మెరిశాడు. కాగా, హాఫ్‌ సెంచరీ చేసిన వెంటనే కోహ్లి పెవిలియన్‌ చేరాడు. ఇష్‌ సోథీ వేసిన 29 ఓవర్‌ నాల్గో బంతికి కోహ్లి బౌల్డ్‌ అయ్యాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతి కోహ్లి బ్యాట్‌ను దాటుకుని వెళ్లి వికెట్లను తాకింది.  (ఇక్కడ చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌ శతక్కొట్టుడు)

ఆ తరుణంలో అయ్యర్‌- కేఎల్‌ రాహుల్‌ల జోడి అత్యంత సమన్వయంగా బ్యాటింగ్‌ చేసింది. మంచి బంతులను సమర్ధవంతంగా ఎదుర్కొంటూనే చెత్త బంతులను బౌండరీలు దాటించారు. ప్రధానంగా రాహుల్‌ దూకుడుగా ఆడగా, అయ్యర్‌ మాత్రం నెమ్మదిగా బ్యాటింగ్‌ చేశాడు. ఈ క‍్రమంలోనే 40 బంతుల్లో నాలుగు సిక్స్‌లతో రాహుల్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికి అయ్యర్‌ తన వన్డే కెరీర్‌లో మెయిడిన్‌ సెంచరీతో మెరిశాడు. ముందుగా 66 బంతుల్లో 5 ఫోర్లతో అర్థ శతకం పూర్తి చేసుకున్న అయ్యర్‌.. మరో 35 బంతుల్లో హాఫ్‌ సెంచరీని సెంచరీగా మలుచుకున్నాడు. రాహుల్‌-శ్రేయస్‌ అ‍య్యర్‌ల జోడి 136 పరుగులి భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత అయ్యర్‌ నాల్గో వికెటట్‌గా ఔటయ్యాడు.  ఆ సమయంలో రాహుల్‌కు కేదార్‌ జాదవ్‌ జత కలిసి స్కోరు బోర్డును మరింత ముందుకు తీసుకెళ్లాడు.  జాదవ్‌ 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో అజేయంగా 26 పరుగులు చేయడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో సౌతీ రెండు వికెట్లు సాధించగా,గ్రాండ్‌ హోమ్‌, ఇష్‌ సోథీలకు తలో వికెట్‌ లభించింది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement