‘రెండో’ది కూడా మనదే.. | IND VS NZ 2nd T20: Team India Won By 7 Wickets | Sakshi
Sakshi News home page

‘రెండో’ది కూడా మనదే..

Published Sun, Jan 26 2020 3:41 PM | Last Updated on Sun, Jan 26 2020 4:45 PM

IND VS NZ 2nd T20: Team India Won By 7 Wickets - Sakshi

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో కోహ్లి సేన 2-0తో ఆధిక్యం సాధించింది. ఆదివారం అచ్చొచ్చిన ఆక్లాండ్‌ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో కివీస్‌ను బోల్తాకొట్టించింది. కివీస్‌ నిర్దేశించిన 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 17.3 ఓవర్లలో కేవలం 3 వికెట్ల కోల్పోయి సులువుగా ఛేదించింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (50 బంతుల్లో 57 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి హాప్‌సెంచరీతో ఆకట్టుకోగా.. శ్రేయాస్‌ అయ్యర్‌ (33 బంతుల్లో 44; 1ఫోర్‌, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం. ఇక కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌతీ రెండు వికెట్లు పడగొట్టగా, సోధి ఒక్క వికెట్‌ దక్కించుకున్నాడు. 

దక్కని శుభారంభం
స్వల్ప లక్ష్యఛేదనలో​ టీమిండియాకు మంచి శుభారంభం లభించలేదు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (8) కివీస్‌ జట్టుపై తన వైఫల్యాలను కొనసాగించాడు. టిమ్‌ సౌతీ వేసిన తొలి ఓవర్‌లోనే రెండు ఫోర్లు కొట్టి ఊపు మీదున్నట్టు కనిపించిన రోహిత్‌ అదే ఓవర్‌లో స్లిప్‌ క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సారథి విరాట్‌ కోహ్లి మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌తో కలిసి నిర్ణయాత్మకమైన భాగాస్వామ్యాన్ని నమోదు చేస్తారని భావించారు. అయితే కోహ్లి (11) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. సౌతీ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు యత్నించి క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. 

ఆకట్టుకున్న అయ్యర్‌-రాహుల్‌
39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను కేఎల్‌ రాహుల్‌-శ్రేయాస్‌ అయ్యర్‌ జంట ఆదుకుంది.. జట్టును గెలిపించింది. ఆరంభంలో ఆచితూచి ఆడిన అయ్యర్‌ తర్వాత వేగం పెంచాడు. ఇక మరోవైపు కేఎల్‌ రాహుల్‌ తన ఫామ్‌ను కొనసాగించాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదతూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే కేఎల్‌ రాహుల్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సిరీస్‌లో రాహుల్‌కు వరుసగా రెండో అర్ధసెంచరీ కావడం విశేషం. ఇక మరోవైపు అయ్యర్‌ సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. ఇదే ఊపులో ఇష్‌ సోధి బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. అయితే శివమ్‌ దుబె(8 నాటౌట్‌)తో కలిసి రాహుల్‌ టీమిండియాను విజయతీరాలు చేర్చాడు. 

సిక్సర్‌తోనే ముగింపు
తొలి టీ20లో సిక్సర్‌తో శ్రేయస్‌ అయ్యర్‌ జట్టుకు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. కాగా, ఈ మ్యాచ్‌లో కూడా సిక్సర్‌తోనే మ్యాచ్‌ను ముగించింది. టిమ్‌ సౌతీ వేసిన 17.3వ బంతిని టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దుబె భారీ సిక్సర్‌ కొట్టి విజయాన్ని అందించాడు. ఇక రెండు మ్యాచ్‌ల్లోనూ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించడం విశేషం. 

కట్టడి చేసిన భారత బౌలర్లు..
అంతకుముందు కివీస్‌ జట్టును భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో కివీస్‌ బ్యాట్స్‌మన్‌ పరుగులు చేయడానికి నానా ఇబ్బందులు పడ్డారు. అయితే టిమ్‌ సీఫెర్ట్ (26 బంతుల్లో 33 నాటౌట్‌, 1 ఫోర్‌, 2 సిక్సర్లు), మార్టిన్‌ గప్టిల్‌(20 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు)లు ఓ మోస్తారుగా రాణించడంతో కివీస్‌ ఓ మోస్తారు స్కోర్‌ను సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు తొలి మ్యాచ్‌ మాదిరి ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. కివీస్‌ విధ్వంసకర ఆటగాడు మున్రో క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో స్కోర్‌ బోర్డు నెమ్మదించింది. మరోవైపు గప్టిల్‌ దాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. 

ఇదే క్రమంలో శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి గప్టిల్‌ క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం కోలిన్‌ మున్రో కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలుచోలేదు. శివమ్‌ దుబె బౌలింగ్‌లో కోహ్లి స్టన్నింగ్‌ క్యాచ్‌కు మున్రో(26) భారంగా క్రీజు వదిలి వెళ్లాడు. కివీస్‌ను ఆదుకుంటాడనుకున్న సారథి కేన్‌ విలియమ్సన్‌ (14)తో పాటు గ్రాండ్‌హోమ్‌(3)లను టీమిండియా బౌలర్లు వెంటవెంటనే పెవిలియన్‌కు పంపించారు. 

తొలి మ్యాచ్‌లో వీరవిహారం చేసిన రాస్‌ టేలర్‌(24 బంతుల్లో 18)ను మన బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. బౌండరీల మాటు అటుంచితే పరుగులు చేయడానికే ఇబ్బందులు పడ్డాడు. అయితే చివర్లో టిమ్‌ సీఫెర్ట్‌ తన బ్యాట్‌కు పనిచెప్పడంతో కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగలకే పరిమితమైంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(2/18), దుబె(1/16), ఠాకూర్‌(1/21), బుమ్రా(1/21)లు ఆకట్టుకున్నారు. వీరితో పాటు షమీ, చహల్‌లు వికెట్లు పడగొట్టకున్నా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి పరుగులు రాకుండా అడ్డుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement