హామిల్టన్: తన కెరీర్‌లో తొలి వన్డే శతకం సాధించిన టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అరుదైన జాబితాలో స్థానం సంపాదించాడు. ఇక్కడ సెడాన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో సెంచరీ చేసిన అయ్యర్.. టీమిండియా భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. 107 బంతుల్లో 11 ఫోర్లు, 1సిక్స్‌తో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే హామిల్టన్‌లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ మైదానంలో అంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్ అజేయంగా 125 పరుగులు చేశాడు. (ఇక్కడ చదవండి: శ్రేయస్ అయ్యర్ శతక్కొట్టుడు)
ఇదే ఇక్కడ భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, ఆ తర్వాత స్థానంలో అయ్యర్ నిలిచాడు. ఈ క్రమంలోనే శిఖర్ ధావన్‌ను అధిగమించాడు. 2009లో సెహ్వాగ్ 125 పరుగులు చేస్తే, 2015లో ధావన్ 100 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇంతకాలానికి ఇక్కడ అయ్యర్ శతకం సాధించడంతోపాటు సెహ్వాగ్ తర్వాత స్థానాన్ని ఆక్రమించాడు. ఈ జాబితాలో సెహ్వాగ్, అయ్యర్, ధావన్‌ల తర్వాత స్థానంలో రాహుల్ తాజా ఇన్నింగ్స్ ఉంది. ఈ మ్యాచ్‌లో రాహుల్ అజేయంగా 88 పరుగులు చేశాడు.
ఇక హామిల్టన్‌లో భారత్ తరఫున అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన మూడో జోడిగా అయ్యర్-కేఎల్ రాహుల్‌లు నిలిచారు. వీరిద్దరూ నాల్గో వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్-గౌతం గంభీర్‌లు 201 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించగా, ధావన్-రోహిత్ శర్మల జోడి 174 పరుగులు సాధించింది. టీమిండియా తరఫున ఇక్కడ అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన నాల్గో జోడిగా ఎంఎస్ ధోని-రవీంద్ర జడేజాల జోడి ఉంది. ఈ జోడి 2014లో ఇక్కడ అజేయంగా ఆరో వికెట్‌కు 127 పరుగులు జత చేశారు. (ఇక్కడ చదవండి: ఇరగదీసిన టీమిండియా)
విండీస్ తర్వాత మనదే టాప్ స్కోర్
ఈ మైదానంలో భారత్ నమోదు చేసిన 347 పరుగుల స్కోరు తొలి ఇన్నింగ్స్ పరంగా చూస్తే రెండో అత్యుత్తమ స్కోరుగా నిలిచింది. వన్డే ఫార్మాట్‌లో అంతకుముందు 2014లో వెస్టిండీస్ ఇక్కడ 363 పరుగులు సాధించగా, ఆ తర్వాత స్థానంలో టీమిండియా తాజా స్కోరు నిలిచింది. మూడో స్థానంలో 2007లో ఆసీస్ 346 పరుగులు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment