పుణె: ఈ ఏడాది వరల్డ్ టీ20 ఉన్న తరుణంలో యువ ఆటగాళ్లను సాధ్యమైనంతవరకూ పరీక్షించాలనే తలంపుతో ఉన్న టీమిండియా మేనేజ్‌మెంట్ ఎట్టకేలకు కేరళ వికెట్ కీపర్ సంజూ సామ్సన్‌కు అవకాశం ఇచ్చింది. శ్రీలంకతో చివరిదైన మూడో టీ20లో సామ్సన్‌కు తుది జట్టులో అవకాశం కల్పించారు. ఈ మ్యాచ్‌కు ముందు ఏకైక అంతర్జాతీయ టీ20 ఆడిన సామ్సన్..ఆ తర్వాత దేశవాళీ, ఐపీఎల్‌లలో రాణించినా మళ్లీ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. 2015లో జింబాబ్వేతో చివరిసారి ఆడిన సామ్సన్.. ఎట్టకేలకు ఇటీవల బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ఎంపికయ్యాడు. అంతకు కొద్ది రోజుల క్రితం విజయ్ హజారే వన్డే టోర్నీలో చేసిన డబుల్ సెంచరీ చేయడంతో సామ్సన్‌ను బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌లలో అతడిని ఆడించకుండా రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేశారు. తర్వాత ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడితే విండీస్‌తో సిరీస్‌కు మళ్లీ ఎంపిక చేశారు. ఇక్కడ కూడా సామ్సన్‌కు నిరాశే ఎదురైంది. కాగా, శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్‌లో సామ్సన్‌కు ఎట్టుకేలకు తుది జట్టులో అవకాశం ఇచ్చారు.
ఇప్పుడు తన కెరీర్‌లో రెండో అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న సామ్సన్.. ఒక అరుదైన జాబితాలో కూడా చోటు సంపాదించాడు. భారత్ తరఫున తన తొలి మ్యాచ్‌కు ఆపై రెండో మ్యాచ్‌కు పట్టిన అంతర్జాతీయ టీ20ల పరంగా చూస్తే సామ్సన్ టాప్‌లో ఉన్నాడు. 2015 నుంచి నేటి సామ్సన్ రీ ఎంట్రీ ముందు వరకూ భారత్ జట్టు 73 అంతర్జాతీయ టీ20లు ఆడింది. అంటే సామ్సన్ 73 అంతర్జాతీయ మ్యాచ్‌లను మిస్సయ్యాడు. భారత్ తరఫున ఒక ఆటగాడికి తొలి టీ20 మ్యాచ్‌కు రెండో టీ20 మ్యాచ్ ఇంతటి మ్యాచ్‌ల వ్యవధి రావడంలో సామ్సన్ రీ ఎంట్రీనే టాప్‌లో నిలిచింది.
ఆ తర్వాత ఉమేశ్ యాదవ్ ఉన్నాడు. 2012లో ఉమేశ్ తొలి అంతర్జాతీయ టీ 20 ఆడగా, రెండో టీ20 ఆడటానికి ఆరేళ్లు నిరీక్షించాడు. ఈ క్రమంలోనే 65 టీ20 మ్యాచ్‌లను ఉమేశ్ కోల్పోయాడు. ఆ తర్వాత స్థానంలో దినేశ్ కార్తీక్(56 మ్యాచ్‌లు) మూడో స్థానంలో ఉండగా, మహ్మద్ షమీ(43 మ్యాచ్‌లు) నాల్గో స్థానంలో ఉన్నాడు.ఇక ఓవరాల్‌గా ఒక జట్టు తరఫున పరిశీలిస్తే ఇంగ్లండ్ క్రికెటర్ జో డెన్లీ(79 మ్యాచ్‌లు) తొలిస్థానంలో కొనసాగుతున్నాడు. 2010 నుంచి 2018 మధ్యకాలంలో డెన్లీ తన రెండో టీ20 ఆడే సమయానికి ఈ ఫార్మాట్‌లో 79 మ్యాచ్‌లు మిస్సయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment