
సఫారీలకు షాక్
భారత పర్యటనలో తొలి రోజే దక్షిణాఫ్రికాకు షాక్ తగిలింది. భారత్ ‘ఎ’ జట్టుతో మంగళవారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో సఫారీ
ఓటమితో సిరీస్‌ను ప్రారంభించిన దక్షిణాఫ్రికా
{పాక్టీస్ టి20లో 8 వికెట్లతో భారత్ ‘ఎ’ ఘన విజయం
మయాంక్ అగర్వాల్ సూపర్ ఇన్నింగ్స్
న్యూఢిల్లీ: భారత పర్యటనలో తొలి రోజే దక్షిణాఫ్రికాకు షాక్ తగిలింది. భారత్ ‘ఎ’ జట్టుతో మంగళవారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో సఫారీ జట్టు 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. పాలెం మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో మూడు వికెట్లకు 189 పరుగుల భారీ స్కోరు చేసింది. డివిలియర్స్ (27 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నివ్వగా... డికాక్ (2) విఫలమయ్యాడు. సహచరుల ప్రాక్టీస్ కోసం కెప్టెన్ డు ప్లెసిస్ (27 బంతుల్లో 42; 7 ఫోర్లు) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. డుమిని (32 బంతుల్లో 68 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) సిక్సర్ల మోత మోగించడంతో సఫారీలు భారీ స్కోరు సాధించారు. మిల్లర్ (10), బెహర్దీన్ (17 నాటౌట్) కొద్దిసేపు క్రీజులో గడిపారు.
భారత బౌలర్లలో కుల్‌దీప్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ తీసుకున్నారు. భారత్ ‘ఎ’ జట్టు 19.4 ఓవర్లలో రెండు వికెట్లకు 193 పరుగులు చేసి... మరో రెండు బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఓపెనర్లు మనన్ వోహ్రా (42 బంతుల్లో 56; 8 ఫోర్లు, 1 సిక్సర్), మయాంక్ అగర్వాల్ (49 బంతుల్లో 87; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 119 పరుగులు జోడించి విజయానికి పునాది వేశారు. ముఖ్యంగా మయాంక్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్లు అవుటైనా... సంజూ శామ్సన్ (22 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్), కెప్టెన్ మన్‌దీప్ (7 బంతుల్లో 12 నాటౌట్; 2 ఫోర్లు) తడబాటు లేకుండా లాంఛనాన్ని పూర్తి చేశారు. దక్షిణాఫ్రికా ప్రధాన బౌలర్లు అబాట్, రబడ, మోరిస్, తాహిర్ నలుగురూ భారత ‘ఎ’ బ్యాట్స్‌మెన్‌పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. డుమిని, డిలాంజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.