ఆహా... ‘ఏ’మి ఆడారు
- చెలరేగిన భారత ‘ఎ’ జట్టు
- దక్షిణాఫ్రికాపై బోనస్‌తో గెలుపు
- మయాంక్ సెంచరీ, రాణించిన ఉన్ముక్త్ చంద్
చెన్నై: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ ‘ఎ’ జట్టు... ముక్కోణపు వన్డే సిరీస్‌లో బోణి చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (122 బంతుల్లో130; 16 ఫోర్లు, 1 సిక్స్), ఉన్ముక్త్ చంద్ (94 బంతుల్లో 90; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) దుమ్మురేపడంతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ‘ఎ’పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. డి కాక్ (124 బంతుల్లో 108; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్ల ధాటికి ఓ దశలో ప్రొటీస్ 92 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
అయితే డి కాక్, విలాస్‌లు ఐదో వికెట్‌కు 100 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. చివర్లో సందీప్, ధవల్ సమయోచితంగా బౌలింగ్ చేసి లోయర్ ఆర్డర్‌పై ఒత్తిడి పెంచడంతో దక్షిణాఫ్రికా 52 పరుగుల తేడాతో చివరి 6 వికెట్లను చేజార్చుకుంది. రిషి ధావన్ 4, సందీప్ 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 37.4 ఓవర్లలో 2 వికెట్లకు 247 పరుగులు చేసి నెగ్గింది. సఫారీ బౌలర్లందర్నీ దీటుగా ఎదుర్కొన్న మయాంక్, ఉన్ముక్త్ తొలి వికెట్‌కు 219 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక మనీష్ పాండే (9 నాటౌట్), కరుణ్ (4 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.