సాక్షి, ఇండోర్: టీమిండియా జైతయాత్ర కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో 5 వన్డేల సిరీస్‌లో రెండు వన్డేలు మిగిలి ఉండగానే 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. 294 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లి సేన ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానేలు వేసిన గట్టి పునాదికి పాండ్యా అర్ధ సెంచరీ తోడవ్వడంతో అలవోక విజయం సాధించింది.
శుభారంభం అందించిన ఓపెనర్లు..
రోహిత్, రహానేలు అర్ధసెంచరీలతో చెలరేగడంతో భారత్ తొలి వికెట్ 139 పరుగులు జమయ్యాయి. రోహిత్ శర్మ 71 (62బంతులు 6 ఫోర్లు నాలుగు సిక్సులు), కౌల్టర్ నీల్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటవ్వగా.. ఆవెంటనే రహానే 70 (76బంతులు 9 ఫోర్లు) ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లి, పాండ్యాలు ఆచితూచి ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించారు.
పాండ్యా మెరుపులు..
పాండ్యా మాత్రం తనదైన శైలిలో వచ్చిరాగానే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. జట్టు స్కోరు 203 పరుగుల వద్ద కోహ్లి(28) అగర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేదార్ జాదవ్(2) మరోసారి నిరాశపర్చాడు. క్రీజులోకి వచ్చిన మనీష్ పాండేతో చెలరేగిన పాండ్యా 45 బంతుల్లో కెరీర్‌లో నాలుగో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. విజయానికి 10 పరుగుల దూరంలో ఉండగా పాండ్యా 78(72 బంతులు; 5 ఫోర్లు, 4 సిక్సులు) కమిన్స్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని(2), మనీష్ పాండే(36)లు భారత్‌కు 14 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందించారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్‌కు రెండు వికెట్లు, రిచర్డ్సన్, అగర్, కౌల్టర్ నీల్‌లకు తలో వికెట్ దక్కింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న హర్దిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ వరించింది. ఈ విజయంతో వరుస తొమ్మిది వన్డేల్లో విజయం సాధించిన కెప్టెన్‌గా ధోని పేరిట ఉన్న రికార్డును కోహ్లి సమం చేశాడు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ఓపెనర్ అరోన్ ఫించ్ 124(125 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకం, కెప్టెన్ స్మిత్(63) అర్ధసెంచరీలతో రాణించడంతో 6 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసింది. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, బుమ్రాలకు రెండు వికెట్లు దక్కగా, చాహల్, పాండ్యాలకు తలో వికెట్ దక్కింది.