నాటింగ్‌హామ్: ఇంగ్లండ్ మరోసారి చైనామన్ కుల్దీప్ యాదవ్ (6/25) స్పిన్‌లో చిక్కుకుంది. మొదట పటిష్టస్థితిలో ఉన్న ఇంగ్లిష్ ఇన్నింగ్స్ ఆ తర్వాత కుల్దీప్ ‘మణికట్టు’ మాయలో పడింది. గురువారం జరిగిన తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 268 పరుగుల వద్ద ఆలౌటైంది. జోస్ బట్లర్ (51 బంతుల్లో 53; 5 ఫోర్లు), బెన్ స్టోక్స్ (103 బంతుల్లో 50; 2 ఫోర్లు) రాణించారు. ఉమేశ్ యాదవ్ 2, చహల్ ఒక వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 40.1 ఓవర్లలో 2 వికెట్లకు 269 పరుగులు చేసి గెలిచింది. రోహిత్ శర్మ (114 బంతుల్లో 137 నాటౌట్; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) కెరీర్‌లో 18వ సెంచరీతో చెలరేగగా, విరాట్ కోహ్లి (82 బంతుల్లో 75; 7 ఫోర్లు) రాణించాడు. మరో 9.5 ఓవర్లు మిగిలి ఉండగానే భారత్ గెలవడం విశేషం. కుల్దీప్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే శనివారం జరుగుతుంది.
10–0–25–6...
ఇది భారత స్పిన్నర్ కుల్దీప్ బౌలింగ్ ప్రదర్శన. అతడు వేసిన 60 బంతుల్లో 38 డాట్ బాల్సే. ఒక్కటంటే ఒక్కటి కూడా బౌండరీ లైన్‌ను దాటలేదు. అంతలా రెచ్చిపోయాడు ఈ చైనామన్ బౌలర్. మొదట టాపార్డర్‌ను, ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను ఆదుకున్న మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌ను... ఇలా క్రీజులో ఎవరు వచ్చినా విడిచిపెట్టలేదు. 300 పైచిలుకు స్కోరు ఖాయమనుకున్న జట్టును 268 పరుగులకే కట్టడి చేశాడు. టాస్ నెగ్గిన కోహ్లి ఫీల్డింగ్‌కే మొగ్గుచూపాడు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన జేసన్ రాయ్ (35 బంతుల్లో 38; 6 ఫోర్లు), బెయిర్‌స్టో (35 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించారు. పేసర్లు ఉమేశ్, సిద్ధార్థ్ కౌల్‌లను చితకబాదిన ఓపెనర్లు కుల్దీప్ బౌలింగ్‌కు దిగగానే మోకరిల్లారు. తొలి ఓవర్లోనే రాయ్‌ని, రెండో ఓవర్లో జో రూట్ (3), బెయిర్‌స్టోలను ఔట్ చేశాడు. దీంతో జట్టు స్కోరు వంద దాటినప్పటికీ 4 కీలక వికెట్లను కోల్పోయింది. ఈ దశలో బట్లర్, బెన్‌స్టోక్స్ జట్టును ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 93 పరుగులు జతచేశారు. ఆ తర్వాత మళ్లీ కుల్దీప్ మాయ మొదలైంది. వీరిద్దరితో పాటు విల్లీ (1)ని ఔట్ చేశాడు. చివర్లో మొయిన్ అలీ (24), ఆదిల్ రషీద్ (22) ఓ మోస్తరుగా రాణించడంతో ఇంగ్లండ్ 250 పరుగుల మార్కును దాటింది.
రోహిత్ జోరు...
బ్యాట్స్‌మెన్ ఫామ్ దృష్ట్యా ఏమంత కష్టం కానీ లక్ష్యాన్ని భారత్ సునాయాసంగానే ఛేదించింది. ఓపెనర్ రోహిత్ శర్మ మళ్లీ ఇంగ్లిష్ బౌలింగ్‌ను ఈజీగా చితక్కొట్టాడు. ఈ టూర్‌లో రెండు వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలు బాదేశాడు. చివరి టి20లోనూ శతక్కొట్టిన భారత ఓపెనర్ ఈ తొలి వన్డేలోనూ చెలరేగాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో ధావన్ (27 బంతుల్లో 40; 8 ఫోర్లు) ధాటి కొనసాగింది. అతను వేగంగా ఆడే పనిలో వెనుదిరగ్గా... తొలి వికెట్‌కు 59 పరుగులు జతయ్యాయి. తర్వాత కెప్టెన్ కోహ్లి క్రీజులోకి రాగా రోహిత్ ఆట మొదలైంది. ఇద్దరు చక్కని సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా పరుగులు జతచేశారు. దీంతో 15వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది. ఇద్దరు అదును దొరికిన బంతిని బౌండరీకి తరలిస్తూ జట్టు రన్‌రేట్ పడిపోకుండా ఆడుకున్నారు. ఈ క్రమంలో మొదట రోహిత్ 54 బంతుల్లో (6 ఫోర్లు, 1 సిక్స్)... తర్వాత కోహ్లి 55 బంతుల్లో (5 ఫోర్లు) అర్ధసెంచరీల్ని పూర్తిచేసుకున్నారు. దీంతో 30 ఓవర్లకంటే ముందే 28.2 ఓవర్లలోనే జట్టు స్కోరు 200 దాటింది. మొయిన్ అలీ, ఆదిల్ రషీద్‌ల బౌలింగ్‌లో సిక్స్‌లు కొట్టిన రోహిత్ 82 బంతుల్లో (12 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేశాడు. రెండో వికెట్‌కు 167 పరుగులు జోడించాక, జట్టు స్కోరు 226 పరుగుల వద్ద విరాట్ కోహ్లి స్టంపౌటైనా రోహిత్ శర్మ లాంఛనాన్ని పూర్తిచేశాడు.
కుల్దీప్ కోత.. రోహిత్ మోత : భారత్ ఘన విజయం
Published Fri, Jul 13 2018 12:54 AM | Last Updated on Fri, Jul 13 2018 12:57 PM
Comments
Please login to add a commentAdd a comment