వానలో కుమ్మేశారు
► భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు
► 124 పరుగులతో టీమిండియా ఘనవిజయం
► చెలరేగిన యువరాజ్, కోహ్లి
► రాణించిన రోహిత్, ధావన్
► హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన
అవలీలగా, అలవోకగా... అతి సునాయాసంగా, అసలు పోటీ అనేదే లేకుండా భారత్ ప్రత్యర్థిని కుమ్మేసింది... మాటలకే తప్ప మన ‘పక్కింటోడు’ ఆటలో మనకు ఆమడ దూరం దిగువన ఉన్నాడని మరో మారు ఢంకా బజాయించి చెప్పింది... ఎక్కడా తడబాటు లేకుండా పాకిస్తాన్ పని పట్టిన టీమిండియా ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో 24,156 మంది రికార్డు స్థాయి ప్రేక్షకుల మధ్య మన విజయ ధ్వజాన్ని గర్వంగా ఎగరేసింది. వర్షం పదే పదే వెంటాడినా... చివరకు కోహ్లి సేననే విక్టరీ వానలో తడిసింది.
ఏడాదిన్నర విరామం తర్వాత మళ్లీ జత కట్టిన రోహిత్, శిఖర్ జంట సాధికారికంగా తమ ఓపెనింగ్ బాధ్యతలు నెరవేర్చింది... ఆపై కోహ్లి ఎప్పటిలాగే మరో అర్ధ సెంచరీ...పాత బాకీ తీర్చాలన్నట్లుగా యువరాజ్ సింగ్ బ్యాటింగ్ మోతతో చెలరేగిపోగా, చివర్లో పాండ్యా హ్యాట్రిక్ సిక్సర్లతో తానూ ఉన్నానని గుర్తు చేశాడు. ఆరంభం నుంచే ఆపసోపాలు పడిన పాక్‌కు ఇది తలకు మించిన భారమే అయిపోయింది. ప్రతీ పరుగు కోసం శ్రమించిన ఆ జట్టు చివరకు బొక్కబోర్లా పడింది.
బర్మింగ్‌హామ్: చాంపియన్స్ ట్రోఫీ విజయయాత్రను భారత్ ఘనంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై సునాయాస విజయంతో డిఫెండింగ్ టీమ్ తమ పదును చూపించింది. ఆదివారం ఇక్కడ ఏకపక్షంగా సాగిన వన్డేలో భారత్ 124 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 48 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (119 బంతుల్లో 91; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (68 బంతుల్లో 81 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), శిఖర్ ధావన్ (65 బంతుల్లో 68; 6 ఫోర్లు, 1 సిక్స్), యువరాజ్ సింగ్ (32 బంతుల్లో 53; 8 ఫోర్లు, 1 సిక్స్) భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు. చివరి 4 ఓవర్లలో భారత్ ఏకంగా 72 పరుగులు కొల్లగొట్టడం విశేషం. వర్షంతో అంతరాయం కలిగిన కారణంగా పాకిస్తాన్ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 289 పరుగులుగా నిర్దేశించారు. అయితే పాక్ 33.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటైంది. ఉమేశ్ యాదవ్‌కు 3 వికెట్లు దక్కాయి. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 8న శ్రీలంకతో ఆడుతుంది.
మరో సెంచరీ...
నాలుగేళ్ల క్రితం చాంపియన్స్ ట్రోఫీలో తొలిసారి ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఐదు మ్యాచ్‌లలో వరుసగా 127, 101, 58, 77, 19 పరుగులు జోడించి జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించారు. ఈసారి కూడా వీరిద్దరు భారత్‌కు అదిరే ఆరంభం ఇచ్చారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడిన వీరిద్దరు కుదురుకున్నాక చక్కటి షాట్లతో అలరించారు. ఆమిర్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా వేయడంతో భారత్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న 17వ బంతికి రోహిత్ తొలి ఫోర్ కొట్టగా, ధావన్ 23 బంతులు తీసుకున్నాడు. వర్షంతో వచ్చిన విరామం తర్వాత వీరిద్దరు వేగంగా దూసుకుపోయారు. షాదాబ్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ కొట్టి రోహిత్ 71 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... వహాబ్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన ధావన్ 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో మూడు సెంచరీల భాగస్వామ్యాలు నమోదు చేసిన ఏకైక జోడి రోహిత్, ధావన్‌దే కావడం విశేషం. ఎట్టకేలకు ధావన్‌ను అవుట్ చేసిన షాదాబ్, పాక్‌కు తొలి వికెట్ అందించాడు. కొద్ది సేపటి తర్వాత సెంచరీ దిశగా దూసుకుపోతున్న సమయంలో రోహిత్ రనౌట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు 43 పరుగుల వద్ద కోహ్లి ఇచ్చిన క్యాచ్‌లో డీప్ స్క్వేర్ లెగ్‌లో ఫహీం అష్రఫ్ వదిలేశాడు.
యువీ మెరుపులు...
ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో వన్డేల్లో చెలరేగిన యువీ, ఇప్పుడు ఇంగ్లండ్‌లో తన సత్తా ప్రదర్శించాడు. 8 పరుగుల వద్ద లాంగాఫ్‌లో తాను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను హసన్ అలీ వదిలేయగా, యువరాజ్ దానిని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. అదే హసన్ బౌలింగ్‌లో 4 ఫోర్లు, ఒక భారీ సిక్సర్ కొట్టిన యువీ, వహాబ్ బౌలింగ్‌లో 3 బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున వేగవంతమైన అర్ధ సెంచరీ (29 బంతుల్లోనే)ని నమోదు చేశాడు. మరో ఎండ్‌లో కోహ్లి తనదైన శైలిలో చూడచక్కటి షాట్‌లతో అలవోకగా అర్ధ సెంచరీ సాధించాడు. వహాబ్ వేసిన 46వ ఓవర్లో భారత్ పండగ చేసుకుంది. ఈ ఓవర్లో కోహ్లి వరుసగా 4, 4, 6 కొట్టగా, యువీ మరో ఫోర్ బాదడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. హసన్ బౌలింగ్‌లో యువీ అవుట్ కావడంతో ఈ 93 పరుగుల (9.4 ఓవర్లలో) భారీ భాగస్వామ్యానికి తెర పడింది.
పాండ్యా సూపర్...
ఇమాద్ వేసిన ఆఖరి ఓవర్లో కూడా భారత్ 23 పరుగులు పిండుకుంది. ఐపీఎల్ ఉత్సాహంతో ఉన్న హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 20 నాటౌట్; 3 సిక్సర్లు)ను బ్యాటింగ్‌లో ధోనికంటే ముందు పంపి భారత్ ఫలితం సాధించింది. తొలి మూడు బంతుల్లో పాండ్యా భారీ సిక్సర్లతో చెలరేగాడు. అదే ఓవర్ చివరి బంతికి కోహ్లి మరో ఫోర్ కొట్టి ఇన్నింగ్స్‌ను ముగించాడు. చాంపియన్స్ ట్రోఫీలో అతి చెత్త బౌలింగ్ ప్రదర్శన వహాబ్ రియాజ్ (0/87) పేరిట నమోదైంది.
టపటపా...
భారీ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఏ దశలోనూ దూకుడు కనబర్చలేకపోయింది. ఓపెనర్ షహజాద్ (12), బాబర్ ఆజం (8) ఏ మాత్రం ప్రభావం చూపించకుండానే వెనుదిరిగారు. భారత పేసర్లు కట్టుదిట్టమైన బంతులు విసరడంతో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం దక్కలేదు. తొలి 15 ఓవర్లలో (90 బంతుల్లో) పరుగులు రాని బంతులు (డాట్ బాల్స్) ఏకంగా 56 ఉండటం మన బౌలింగ్ సత్తాను, పాక్ ఘోర వైఫల్యాన్ని చూపిస్తోంది. ఆ తర్వాత కూడా పాక్ పుంజుకోలేదు.
రోహిత్ అవుటా...నాటౌటా?
షాదాబ్ వేసిన ఇన్నింగ్స్ 37వ ఓవర్లో కోహ్లి పాయింట్ దిశగా ఆడి సింగిల్‌కు ప్రయత్నించగా... బాబర్ విసిరిన త్రోను అందుకొని కీపర్ బెయిల్స్‌ను పడగొట్టాడు. ఆ సమయంలో రోహిత్ డైవ్ చేసేందుకు ప్రయత్నించిన సమయంలో నేలని తాకిన అతని బ్యాట్ పైకి లేచింది. థర్డ్ అంపైర్ కెటిల్‌బరో పలు రీప్లేల తర్వాత రోహిత్ అవుటైనట్లు ప్రకటించారు. అయితే దీనిపై కూడా సందేహాలు తలెత్తాయి. పాయింట్ దిశ నుంచే కాకుండా దానికి వ్యతిరేక దిశ అయిన స్క్వేర్ లెగ్ నుంచి అంపైర్ ఒక్క రీప్లే కూడా చూడలేదు. అప్పుడు మరింత స్పష్టత వచ్చి ఉండేదని వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు.
వర్షంతో అంతరాయం...
ఊహించినట్లుగానే భారత్, పాక్ మ్యాచ్‌కు వాన అడ్డంకిగా నిలిచింది. ఆరంభంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్ణీత సమయానికే మ్యాచ్ ప్రారంభం అయింది. అయితే 9.5 ఓవర్లలో భారత్ స్కోరు 46/0 ఉన్న సమయంలో జోరుగా వాన కురిసింది. 45 నిమిషాల పాటు బ్రేక్ వచ్చిన తర్వాత మ్యాచ్ మళ్లీ మొదలైంది. 33.1 ఓవర్ల తర్వాత మరోసారి వర్షం బర్మింగ్‌హామ్ మైదానాన్ని పలకరిచింది. ఈసారి మరో 48 నిమిషాల పాటు ఆట ఆగిపోవడంతో మ్యాచ్‌ను 48 ఓవర్లకు కుదించారు. పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో 4.4 ఓవర్ల తర్వాత మళ్లీ వర్షం రావడంతో ఆ జట్టు లక్ష్యాన్ని, ఓవర్లను కుదించాల్సి వచ్చింది. మ్యాచ్‌కు ముందు లండన్‌లో శనివారం రాత్రి జరిగిన కత్తిపోట్ల దుశ్చర్యలో మరణించినవారికి నివాళిగా ఇరు జట్ల ఆటగాళ్లు మౌనం పాటించారు.
► భారత్ తరఫున అత్యధిక ఐసీసీ టోర్నీలు ఆడిన ఆటగాడిగా యువరాజ్ సింగ్ (14) నిలిచాడు. అతను 3 వన్డే వరల్డ్ కప్‌లు, 6 టి20 ప్రపంచ కప్‌లు, 5 చాంపియన్స్ ట్రోఫీలు ఆడాడు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ రనౌట్ 91; ధావన్ (సి) అజహర్ (బి) షాదాబ్ 68; కోహ్లి నాటౌట్ 81; యువరాజ్ సింగ్ ఎల్బీడబ్ల్యూ (బి) హసన్ అలీ 53; హార్దిక్ పాండ్యా నాటౌట్ 20; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (48 ఓవర్లలో 3 వికెట్లకు) 319.
వికెట్ల పతనం: 1–136, 2–192, 3–285.
బౌలింగ్: ఆమిర్ 8.1–1–32–0, ఇమాద్ వసీమ్ 9.1–0–66–0, హసన్ అలీ 10–0–70–1, వహాబ్ రియాజ్ 8.4–0–87–0, షాదాబ్ ఖాన్ 10–0–52–1, షోయబ్ మాలిక్ 2–0–10–0.
పాకిస్తాన్ ఇన్నింగ్స్: అజహర్ అలీ (సి) పాండ్యా (బి) జడేజా 50; షెహజాద్ ఎల్బీడబ్ల్యూ (బి) భువనేశ్వర్ 12; బాబర్ ఆజం (సి) జడేజా (బి) ఉమేశ్ 8; హఫీజ్ (సి) భువనేశ్వర్ (బి) జడేజా 33; షోయబ్ మాలిక్ రనౌట్ 15; సర్ఫరాజ్ అహ్మద్ (సి) ధోని (బి) పాండ్యా 15; ఇమాద్ వసీమ్ (సి) జాదవ్ (బి) పాండ్యా 0; షాదాబ్ ఖాన్ నాటౌట్ 14; ఆమిర్ (సి) జాదవ్ (బి) ఉమేశ్ 9; హసన్ అలీ (సి) ధావన్ (బి) ఉమేశ్ 0; వహాబ్ రియాజ్ (అబ్సెంట్ హర్ట్); ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (33.4 ఓవర్లలో ఆలౌట్) 164.
వికెట్ల పతనం: 1–47, 2–61, 3–91, 4–114, 5–131, 6–135, 7–151, 8–164, 9–164.
బౌలింగ్: భువనేశ్వర్ 5–1–23–1, ఉమేశ్ 7.4–1–30–3, బుమ్రా 5–0–23–0, పాండ్యా 8–0–43–2, జడేజా 8–0–43–2.